దీపక్ పై తల్లిదండ్రుల కోపం! కోలకతా : పశ్చిమ బెంగాల్ లో అరెస్టయిన మావోయిస్ట్ అగ్ర నాయకుడు వెంకటేశ్వరరెడ్డి అలియాస్ తెలుగు దీపక్ ను కలుసుకోవడానికి అతని తల్లిదండ్రులు ఎటువంటి ఆసక్తీ కనబరచలేదు. అతను గడచిన 13 సంవత్సరాలుగా స్వస్థలాన్ని సందర్శించలేదు. హైదరాబాద్ కు సుమారు 100 కిలో మీటర్ల దూరంలోని చిన్న గ్రామం కొప్పోలు వాసులైన శేషిరెడ్డి, రామకోటమ్మలకు దీపక్ ఏకైక సంతానం. పశ్చిమ బెంగాల్ సిఐడి అధికారులు ఈ నెల 2న అతని అరెస్టు గురించి వారికి సమాచారం అందజేసినట్లు ప్రకాశం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్ పి) నవీన్ చందా చెప్పారు. 'ఇది మా బాధ్యత. కోలకతాలో అతని అరెస్టు గురించి అతని తల్లిదండ్రులకు సమాచారం అందజేశాం. కాని తమ కుమారుని కలుసుకోవడానికి వారి దగ్గర నుంచి లాంఛనంగా అభ్యర్థన ఏదీ రాలేదు' అని చందా తెలిపారు.
సిపిఐ (మావోయిస్ట్) పొలిట్ బ్యూరో సభ్యుడు కిషన్ జీకి సన్నిహిత సహచరుడైన దీపక్ ను కలుసుకోవాలని తల్లిదండ్రులు అభిలషించినట్లయితే జిల్లా పోలీసులు లేదా రాష్ట్ర పోలీసులు చొరవ తీసుకుంటారా అని ప్రశ్నించినప్పుడు, 'ఇది ఎంతో సున్నితమైన అంశం. దీనిపై ఇప్పుడే ఏదైనా మాట్లాడడం సరి కాదు' అని ఎస్ పి సమాధానం ఇచ్చారు. 'ముందు వారిని లాంఛనంగా విజ్ఞప్తి చేయనివ్వండి. ఈ అంశానికి మానవతా కోణం ఉన్నది. మేము తప్పకుండా దీనిని సానుభూతితో పరిశీలిస్తాం' అని చందా చెప్పారు.
ఎస్ పి సమాచారం ప్రకారం, గుంటూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు దీపక్ విద్యార్థి రాజకీయాలలో పాల్గొనడం ప్రారంభించిన తరువాత 1989లో ఇల్లు వదలి వెళ్ళాడు. ఆతరువాత అతను మావోయిస్టులతో కలిశాడు. 'పోలీసుల సమాచారం ప్రకారం అతను 1997లో ఒక్కసారి మాత్రమే ఇంటికి తిరిగి వచ్చాడు' అని చందా తెలిపారు. పేలుడు పదార్థాల నిపుణుడైన దీపక్ ప్రకాశం జిల్లాలో మావోయిస్టుల ప్రభావానికి గురైన ఏకైక వ్యక్తా అనే ప్రశ్నకు ఎస్ పి సమాధానం ఇస్తూ, 'రాష్ట్రంలో మావోయిస్టుల ఉద్యమం సుమారు 30 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. అందువల్ల జిల్లా నుంచి ఆ ఉద్యమంలో చేరింది అతను ఒక్కడేనా అనేది చెప్పడం కష్టం' అని చెప్పారు.
'మావోయిస్టులతో ప్రధాన సమస్య ఏమిటంటే వారు తరచు తమ పేర్లు మార్చుకుంటుంటారు. స్పష్టమైన దాఖలాలు ఏవీ లేనప్పటికీ అతని స్థాయి నాయకుడు ఈ జిల్లాకు చెందినవాడై ఉంటాడని నేను భావించడం లేదు' అని ఆయన చెప్పారు. పలు కేసులలో అతని కోసం అన్వేషిస్తున్నందున అతనిపై రూ. 10 లక్షల రివార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని ఎస్ పి తెలిపారు. దీపక్ ను ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు, కేంద్ర గూఢచారి సంస్థల అధికారులు నిశితంగా ప్రశ్నిస్తున్నారు.
News Posted: 10 March, 2010
|