వైఎస్ మడత పేచీ
తెలంగాణా ప్రజల ప్రత్యేక రాష్ట్ర అభిలాషను, తెలంగాణా ప్రజల సెంటిమెంటును కాంగ్రస్ ఎప్పుడూ గౌరవిస్తూనే ఉందని, ప్రత్యేక తెలంగాణాకు తన ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతారాలు లేవని పేర్కొంటూనే ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర, హైదరాబాద్ ప్రస్తావనలు చేయడమే అసలు సిసలైన మడత పేచీ. ప్రత్యక తెలంగాణా కోరుతున్న ప్రజల సెంటిమెంటునూ, పైన పేర్కొన్న ప్రాంతాలనూ ఒకే గాటన కట్టడం వెనుక ఉన్న చతురతను విశ్లేషించవలసిందే. తెలంగాణా ప్రజలు కోరుతున్నంత బలంగా మిగతా వేర్పాటువాదుల వాదన ఉందా? ఈ ప్రభుత్వం నియమించే సంయుక్త కమిటీ తెలంగాణా ఏర్పాటు ఒక్కదాని పైనే పరిశీలన జరుపుతుందా? లేక తెలంగాణాతో సమానంగా ముఖ్యమంత్రి పేర్కొన్న మిగతా ప్రాంతాల అంశాన్ని కూడా పరిశీలించి నివేదిక సమర్పిస్తుందా? ఆ నివేదిక ఎప్పటిలోగా సమర్పించాలో ఈ ప్రభుత్వం సూచిస్తుందా?
ఇంకో ప్రధానమైన సమస్యను కూడా వైఎస్ ఈ ప్రకటన సందర్భంగా లేవనెత్తారు. చాలా సునిశితంగా స్పృశించవలసిన సున్నితమైన విషయం మైనారిటీలు ముఖ్యంగా ముస్లీంల భద్రతకు సంబంధించినది. ప్రత్యేక తెలంగాణా ఇస్తే తమ భద్రతపై అనుమానాలున్నాయని మైనారిటీలు భావిస్తున్నారన్న వైఎస్ ఏం చెప్పదలచుకున్నారు. ఒకవేళ ప్రత్యేక తెలంగాణా ఇస్తే మైనారిటీలందరూ ఆంధ్ర ప్రాంతానికి వచ్చేస్తారనా? శతాబ్ధాలుగా కలిసి మెలిసి జీవిస్తున్న ప్రజలు తెలంగాణా రాగానే మైనారిటీలను తరిమేస్తారనా? నిజంగా మైనారిటీల్లో అలాంటి అభద్రతా భావం ఉండి ఉండవచ్చు. కాని వారు ఏనాడూ బహిరంగంగా బయటపడలేదే. అలానే తెలంగాణాలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో తరతరాలుగా స్థరపడిపోయిన కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతం వారిని గురించి. కొత్తగా మార్పు వస్తుందంటే జన సామాన్యంలో భయాలు, సందేహాలు సహజంగానే ఉంటాయి. వాటిని పోగుచేసి ముఖ్యమంత్రి హొదాలో అధికారిక ప్రకటనలో పొందు పరచడం వెనుక ఉన్న లౌక్యం ఏమిటి? ఎంత ఔచిత్యం ఉంది. వైఎస్ తన ప్రకటన ద్వారా తెలంగాణా ఇస్తామని చెప్పినట్టా? ఇవ్వబోమని చెప్పినట్టా? రాష్ట్రంలో ఇంకా వేర్పాటు ఉద్యమాలు రావాలని కోరినట్టా? ఇవేం భేతాళ ప్రశ్నలు కావు, తెలిసి కూడా సమాధానం చెప్పకపోతే తల వెయ్యి ముక్కలు కావడానికి.
Pages: -1- 2 News Posted: 12 February, 2009
|