టాటా 'నానో' తీర్ధయాత్ర!
లూధియానా: రతన్ టాటా నానో కార్ల ప్రాజెక్ట్ కనీవినీ ఎరుగని బాలారిష్టలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. సింగూరులో ప్రారంభించిన నానో కార్ల ప్రాజెక్ట్ దాదాపుగా పూర్తి అవుతున్న తరుణంలో బెంగాల్ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ అయిన మమతా బెనర్జీ ఈ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా పెద్ద యుద్ధమే చేశారు. ఫలితంగా పురుడు పోసుకోక ముందే సింగూరులోని నానో ప్రాజెక్ట్ అక్కడి నుంచి గుజరాత్ కు తరలిపోవలసి వచ్చింది. ఇలా అనేక అవాంతరాలను ఎదురీదుతూ వచ్చిన నానో ఇప్పుడు రోడ్డెక్కడానికి సిద్ధమైంది.
నానో కారును వాణిజ్య మార్కెట్ లో విడుదల చేయడానికి ముందు దైవానుగ్రహం కోసం ఆయన ప్రయత్నిస్తుండడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఫ్యాక్టరీలో కొత్తగా తయారైన రెండు నానో కార్లు - ఒకటి తెల్ల రంగు కారు, మరొకటి సిల్వర్ కలర్ కారు శుక్రవారం అమృతసర్ స్వర్ణాలయానికి ఆశీస్సుల కోసం వచ్చాయి. ఆదివారం మరొక నానో అజ్మీర్ లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా వెలుపల ఇరుకు వీధులను చేరుకున్నది. కారుతో వచ్చిన టాటా అధికారులు దర్గాలో ఒక చదర్ ను సమర్పించారు.
'నానోను మార్కెట్లోకి ప్రవేశపెట్టే ముందు మన బహుళ మతాల దేశంలో వివిధ ప్రముఖ ప్రార్థనా మందిరాలలో కారుకు ఆశీస్సులు కోరాలని రతన్ టాటా స్వయంగా ఆదేశించారు' అని కారులో అమృతసర్ కు ప్రయాణించిన ఐదుగురు అధికారులలో ఒకరు తెలియజేశారు. అయితే, ఆయన తన పేరు వెల్లడికి నిరాకరించారు. లక్ష రూపాయల నానో కారును చివరకు ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ గుజరాత్ లోని సానంద్ లో ఇంకా నిర్మాణంలో ఉండడంతో ఇప్పుడు అమృతసర్ కు చేరుకున్న మోడల్ ను ఉత్తరాఖండ్ లోని పంత్ నగర్ లోని టాటా ఫ్యాక్టరీలో అసెంబుల్ చేశారు.
Pages: 1 -2- News Posted: 23 February, 2009
|