జనాలకు చిరంజీవి పిచ్చి
మూడు దశాబ్ధాలు చలనచిత్ర రంగంలో తిరుగులేని కథానాయకునిగా వెలుగొందిన చిరంజీవిని రాజకీయ నాయకునిగా అవతారం ఎత్తి తమ ముంగిటకు రావడం వారిలో ఆనందాన్ని నింపింది. ప్రజారాజ్యం జెండాలు చేతబూని జిందాబాద్ లు కొట్టుకుంటూ మోటారు సైకిళ్ళపై, ఆటోల్లో, ఆర్టీసి బస్సుల టాపులపై, లారీల్లో మైళ్ళకు మైళ్ళు అభిమానులు చిరంజీవిని వెన్నంటే ప్రయాణించారు. యాత్రలో ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రాణాలు పోతున్నాయని తెలిసినా రాయలసీమ అభిమానులు తెగువను వదలలేదు. చిరంజీవిని చూడటానికి ఏ అడ్డంకి కల్పించినా ఆగ్రహావేశాలతో రగిలిపోయారు. వాహనాల వరసను దాటుకుని చిరంజీవి ప్రయాణిస్తున్న ప్రజా అంకిత రథం దగ్గరకు దూసుకుపోవడానికి తహతహలాడిపోయారు. అడ్డొచ్చిన పోలీసులపై తిరగబడ్డారు. చిరంజీవి వ్యక్తిగత భద్రతా సిబ్బందిపై సైతం దాడులు చేశారు. పాడుపడిన భవనాలపైకి, కరంటు స్థంబాల పైకి, కటౌట్ల మీదకు, చెట్ల మీదకు లెక్కకు మించి జనం ఎక్కిపోయారు. అవి కూలిపోతే మరణించారు. గాయపడ్డారు.లాఠీ దెబ్బలు తిన్నారు. తొక్కిసలాటలో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వేలవేల జనం మధ్యకు మహిళలు కూడా వచ్చేశారు.ఎన్నో పాట్లు పడ్డారు. నలిగిపోయారు. కాని ఎక్కడా వెనక్కు తగ్గలేదు. కర్నూలు జిల్లా యాత్రలో ఎంతమంది గాయపడ్డారో లెక్కే తెలియదు. కాని చిరంజీవిని చూసిని ఆనందం... మహదానందం మాత్రం దక్కించుకున్నారు.
నడి రోడ్డుపై వృద్ధులు కూడా చిందులు వేశారు. వేసుకున్న దుస్తులు చిరిగిపోతున్నా, జారిపోతున్నా పట్టించుకోలేదు. కొన్ని వేల మంది చెప్పులను రోడ్లపై వదిలేసి చిరంజీవి వెంట పరుగులు తీశారు. ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాల్లో అయితే మొత్తం జనం ఇళ్ళను వదిలి రోడ్ల పైనే ఉన్నారు. తన కోసం తరలివచ్చిన ప్రజా వాహినులను చూసి ఆయన ఆనందంతో తబ్బిబ్బయ్యారు. ప్రత్యర్ధి రాజకీయ పక్షాలపై ఆరోపణ, విమర్శనాస్త్రలతో విరుచుకుపడ్డారు. అవినీతిపై ఆగ్రహావేశాలను ప్రదర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్, తెలుగుదేశం అధినేత చంద్రబాబులపై వ్యంగ పదజాలంతో ధ్వజం ఎత్తారు. వాటికి అభిమానుల నుంచి మంచి స్పందన రాబట్టుకున్నారు. ఈ వచ్చిన ప్రజలు రాజకీయంగా చిరంజీవికి ఎంత మేరకు ఉపయోగపడతారన్న బేరీజులను పక్కన పెడితే జనాలను సమ్మోహితులను చేయడంలో చిరంజీవి తిరుగులేదనే విషయాన్ని తేటతెల్లంగా తేల్చిచెప్పింది కర్నూలు జిల్లా ప్రజా అంకితయాత్ర.
Pages: -1- 2 News Posted: 23 February, 2009
|