ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర రాజకీయ రంగంలోకి ప్రవేశించిన తరువాత సినీ నటుల రాజకీయ ప్రవేశంపై వ్యంగ్య పదజాలంతో విమర్శలు చేయడం ఎక్కువైంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ తదితరుల వ్యక్తిగత జీవితాలను రాజకీయ అంశాలుగా చూపించడానికి అటు కాంగ్రెస్ లోని మహిళా నాయకులు, ఇటు తెలుగుదేశం మహిళా నాయకులు పోటీలు పడుతున్నారు. ఒక విధంగా పవన్ కళ్యాణ్ వివాహం అనంతరం కాంగ్రెస్ విమర్శల జోరు తగ్గింది. తెలుగుదేశంలో చురుక్కుమనే ఆరోపణలు చేసే రాజకుమారి కూడా ఈ మధ్య వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉంటున్నారు. కాని సినిమా రంగం నుంచి తెలుగుదేశం పార్టీలో చేరి చాలా త్వరగా కీలక పదవిని పొందిన రోజా విడవ కుండా చిరంజీవి సోదరులపై వ్యంగ్య బాణాలు వదులుతూనే ఉన్నారు. ఒక దశలో పవన్ కళ్యాణ్ ఘాటుగానే హెచ్చరించారు. తాను నోరు విప్పితే రోజా ప్రజల ముఖం చూడలేరని ఆయన నర్మగర్భంగా ప్రకటించారు. తాజాగా మళ్ళీ రోజా చేసిన ఆరోపణలపై ఆయనే స్పందిస్తూ రోజా విమర్శలను తాను పట్టించుకోనని, ఆమె కూడా కళారంగానికి చెందిన సహచర నటి అని వదిలేశారు. మహిళా నాయకురాలికి సమాధానం చెప్పే బాధ్యతను తమ పార్టీ నాయకురాలికి అప్పగించారు.
దాంతో తీవ్రస్థాయి వివాదానికి తెర లేచింది. గౌరవప్రద రాజకీయాలకు అర్ధం మారిపోయిన రోజుల్లో రాజకీయాలలోకి వచ్చిన ఈ ఇద్దరు మహిళా నాయకామణులూ భాషకు ఉన్న సభ్యతకు తిలోదకాలు ఇచ్చారు. తిట్టుకోవడమే రాజకీయాలన్న భ్రమలో వ్యక్తిగత విలువలకు వలువలూడ్చేశారు. అంతర్గత వ్యవహారాలనూ రాజకీయ లబ్ధికి వాడుకోవాలన్న పరమ దుర్మార్గమైన ఆలోచనను అమలు చేశారు. దాని ఫలితం సభ్యసమాజం వినకూడని మాటలను బహిరంగంగా పలికారు. రాజకీయ మైకంలో పడి తాము మహిళమన్న స్పృహను కోల్పోయారు. రాజకీయనాయకుల బాధ్యతలో పలికే మాటలకు జనామోదం ఉండి తీరాలన్న సూత్రాన్ని విస్మరించారు. ఈ వివాదానికి తెర తీసినది మొదటగా మహిళారాజ్యం అధ్యక్షురాలు శోభారాణి. ఆమె వాడిన పదజాలం చూడండి. ` రోజా నిర్మాతల కొడుకులతో తిరిగింది. ప్రేమ పేరుతో ఎంతో మందిని మోసం చేసింది. సెల్వమణిని కూడా మోసం చేసి బెదిరించి పెళ్లి చేసుకుంది. ఆమె చీకటి జీవితం అందరికీ తెలిసిందే. అశ్లీల దృశ్యాలలో నటించిన రోజాకు పాత వాసనలు పోలేదు. ఇటీవలే పాటకు చిందులు వేసింది. చెల్లని చెక్కులు ఇచ్చి కేసుల్లో ఇరుక్కున్న 420 రోజా. ఆవిడకు తెలుగు మహిళ అధ్యక్షురాలిగా పదవి ఇవ్వడం మహిళలనే అవమానించడం'. దీనిలో రాజకీయ పరమైన అంశాలేమైనా ఉన్నాయా. దీనికి సమాధానంగా రోజా మరింత బరి తెగింపు భాషను, పరిధులు దాటిన అంశాలను ఎంచుకున్నారు. చిరంజీవి! వేషాల కోసం మీరు ఎంతమందిని పడుకోబెట్టుకున్నారు? మీ తమ్ముడు ఎంత మందిని పడుకోబెట్టుకున్నారు? అని ప్రశ్నిస్తూ దీనిపై ఏకంగా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేణూ దేశాయ్ ను కూడా రోజా అసభ్యకర రీతిలో ప్రస్తావించారు. వీటిలో రాజకీయం ఎంతుంది? ఏమైనా 2009 ఎన్నికల పుణ్యాన అనేక రకాలుగా అనారోగ్య లక్షణాలు రాజకీయాలకు సోకుతున్నాయి.