'చావ్లా వ్యాఖ్యల కోసం ఆయనకు సిఇసి లేఖను పంపి ఉండేవారమే. ఆయన కూడా ఎదురు ఆరోపణలు చేసి ఉండేవారు. చివరకు ఆరోపణలపై దర్యాప్తు కోసం మేము సిట్టింగ్ లేదా రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి ఒకరిని నియమించవలసి వచ్చేది' అని మంత్రిత్వశాఖ తన లేఖలో వివరించింది. ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలను ఎలా నిర్వహిస్తారో ప్రపంచం చూస్తున్న సమయంలో 'వ్యక్తిగత సంఘర్షణలకు సంబంధించిన వివాదాలపై కాలం వృథా చేయజాలం' అని మంత్రిత్వశాఖ తన లేఖలో స్పష్టం చేసింది.
చావ్లాకు 'రాజకీయ తటస్థత' కొరవడిందని నిరూపించేందుకు గోపాలస్వామి ఉటంకించిన 12 సందర్భాలను 'భేదాభిప్రాయాల' కారణంగా తలెత్తిన సమస్యలుగా మంత్రిత్వశాఖ కొట్టివేసింది. చావ్లా 'కాంగ్రెస్ అనుకూల' వైఖరిని ప్రశ్నించేందుకు గడచిన రెండు సంవత్సరాలలో పలు రాష్ట్రాలలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఉదంతాలను గోపాలస్వామి ఉటంకించారు. ఆయన సిఫార్సును సరైన రీతిలోనే బుట్టదాఖలా చేశారని కేంద్ర న్యాయ శాఖ మంత్రి హెచ్.ఆర్. భరద్వాజ వ్యాఖ్యానించారు. 'సిఇసి సొంత అభిప్రాయంతోనే ఆ నిర్ణయానికి వచ్చారు' అని భరద్వాజ పేర్కొన్నారు.