డిఎస్ కోటపై వైఎస్ కన్ను!
హైదరాబాద్: ఒకే దెబ్బకి రెండు పిట్టల్ని కొట్టాలని చాలామంది అనుకుంటారు. అదే మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అయితే మూడు పిట్టల మీద గురి పెట్టినట్టు కనిపిస్తోంది. కేంద్ర మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్, ఎంపి మధు యాష్కి గౌడ్ ఆ మూడు పిట్టలు. బుధవారం జరిగిన కాంగ్రెస్ ఎన్నికల(సంబంధిత)సమావేశంలో వైఎస్ నిజామాబాద్ లోక్ సభ స్థానానికి పార్టీ అభ్యర్ధిగా అసెంబ్లీ స్పీకర్ సురేశ్ రెడ్డి పేరును ప్రతిపాదించి బాంబు పేల్చారు. 'కేంద్ర మంత్రి జైవాల్ రెడ్డిలా రెడ్డి కులానికి చెందిన, ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడ గలిగే, స్పీకర్ అనుభవంతో పార్లమెంటరీ నడవడికను ఆకలింపు చేసుకున్న యువ నాయకుడిని రంగంలోకి దించి జైపాల్ ను తెరమరుగు చేయడం ముఖ్యమంత్రి లక్ష్యం.
ఈ ఎత్తు అటు లోక్ సభకు వెళ్లాలనుకుంటున్న పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్, ఇటు తెలంగాణా కావాలంటూ గొంతు చించుకుంటున్న నిజామాబాద్ ఎంపి మధు యాష్కి ల ఆటకట్టించడానికే' అని కాంగ్రెస్ నాయకుడొకరు వివరించారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనను పిసిసి అధ్యక్షుడు గట్టిగా వ్యతిరేకించడంతో, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి వీరప్ప మొయిలీతో రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీ గురివారం సమావేశమైనప్పుడు తీవ్ర వాగ్వివాదాలు చెలరేగవచ్చు. లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసి, దానిని ఎఐసిసి కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించడానికి ఈ సమావేశం జరుగుతోంది. కేంద్ర కమిటీ న్యూఢిల్లీలో మార్చి 8న సమావేశమవుతుంది.
Pages: 1 -2- News Posted: 5 March, 2009
|