కుదేలవనున్న ఆర్ధిక వ్యవస్థ
116 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 94 దేశాల్లో ఆర్ధికాభివృద్ధి మందగిస్తుంది. వాటిలో 43 దేశాల్లో పేదరికం అత్యధిక స్థాయికి చేరుకుంటుంది. ఇప్పటిదాకా చాల బలమైన రంగాలే దెబ్బతిన్నాయి. ఎగుమతులు, నిర్మాణ రంగం, మైనింగ్, మాన్యుఫాక్చరింగ్ రంగాలు తీవ్ర మాంద్యాన్ని ఎదుర్కొంటున్నాయి. జెమ్స్, ఆభరణాలు, ఆటోమొబైల్, టెక్స్ టైల్స్ వగైరా రంగాల్లో గత ఏడాది మూడు నెలల కాలంగా దేశంలో దాదాపు 5 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని నివేదిక పేర్కొంది.
ప్రపంచంలోని చాలా పేద దేశాలు అభివృద్ధి చెందిన దేశాల ఆర్ధిక సహకారంపై ఆధారపడి తమ మనుగడ సాగించే పరిస్థితి మరింతగా పెరిగింది. సంక్షోభ సమయంలో ఆ దేశాల ఎగుమతులు పూర్తిగా దెబ్బతిన్నాయి. 2005 గ్లెనీగల్స్ శిఖరాగ్ర సమావేశంలో 39 బిలియన్ డాలర్ల ఆర్ధిక సహకారాన్ని అందిస్తామని దాతలు వాగ్దానం చేశారని బ్యాంక్ తెలిపింది. అయితే అలా వాగ్దానం చేసిన దాత దేశాల్లో కొన్ని తమ వాగ్దానాలను నెరవేర్చగల్గే పరిస్థితుల్లో లేవు. కొన్ని దేశాలు వచ్చే ఏడాదికి వాయిదా వేశాయని ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలిపింది.
ప్రభుత్వం, ప్రైవేట్ రంగ రుణాలు, వాణిజ్య లోటుతో ఇబ్బందుల్లో ఉన్న 129 దేశాలకు కనీస మాత్రం నిధులను సమకూర్చగల్గే స్తోమత అంతర్జాతీయ ద్రవ్య సంస్థలకు స్వతహాగా లేదు. ప్రభుత్వాలు, బహుళ జాతి సంస్థలు, ప్రైవేట్ రంగం వగైరాలు కలసి ఉమ్మడిగా నిర్ణయాలకు రావలసి ఉంటుంది. దెబ్బతిన్న దేశాల్లో కేవలం నాల్గవ వంతు దేశాలు మాత్రమే ఆర్దిక కుదింపు నేపథ్యంలో ఉపాధి కల్పన లాంటి రక్షణ చర్యల్ని చేపట్టగలవు. ప్రపంచ ఆర్ధిక సంక్షోభ పరిష్కారం విడి విడి దేశాలకు సంబంధించిన వ్యవహారం కాదు. దీనికి ప్రపంచ దేశాలన్ని కలసి కట్టుగా ఉమ్మడి పరిష్కారాన్ని వెతకాల్సి ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్ధిక మారణహోమానికి గురి కాకుండా సకాలంలో చర్యలు చేపట్టవలసి ఉంటుంది. ప్రపంచ స్థాయి సంక్షోభానికి ప్రపంచ స్థాయి పరిష్కారమే శరణ్యం.
Pages: -1- 2 News Posted: 9 March, 2009
|