ఐపిఎల్ నాలుగు స్తంభాలాట!
ఒకవేళ ఐపిఎల్ టోర్నమెంట్ వాయిదా పడితే, అంతర్జాతీయ క్యాలెండర్ లో దానిని ఇరికించడానికి ఏ మాత్రం అవకాశం లేదు. 45 రోజులు పట్టే ఈ టోర్నమెంట్ కు రెండు నెలల వ్యవధి కావాలి. ప్రస్తుతం ఐసిసి క్యాలెండర్ ఎంతగా కిక్కిరిసి పోయి ఉందంటే, కనీసం 50 రోజులు కూడా ఐపిఎల్ కు కేటాయించే వెసులుబాటు కనిపించడం లేదు. మే 25 నుంచి భారత జట్టు షెడ్యూలు మరీ బిజీ బిజీ! వాస్తవానికి గత నవంబర్ 26న జరగవలసిన ఏడు రోజుల చాంపియన్స్ లీగ్ ట్వంటీ టోర్నమెంట్ వాయిదా పడినప్పటి నుంచి మళ్లీ దానిని నిర్వపించడానికి ఇంతవరకూ ఐపిఎల్ కు తేదీలు, స్టేడియాలు లభ్యం కాలేదు.
వచ్చే మే 25 తరువాత భారత జట్టు ట్వంటీ వరల్డ్ కప్ పోటీలలో ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్తుంది. తరువాత వెస్టిండీసే లో వన్డే ఇంటర్నేషనల్ సిరీస్, ఆ తరువాత జింబాబ్వే పర్యటన, అది ముగిసిన వెంటనే ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ, చాంపియన్స్ లీగ్ టి-20 టోర్నమెంట్లు ఒకదాని వెంట మరొకటి తరుముకొస్తాయి. అవన్నీ పూర్తయ్యే సరికి ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్తాన్ జట్లు ఇండియా పర్యటనకు వస్తాయి. ఈ నేపథ్యంలో, తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండన్నట్టు, షెడ్యూలు మార్చండంటూ హోం శాఖ చెప్పడంతో ఐపిఎల్ నిర్వాహకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది.
Pages: -1- 2 News Posted: 14 March, 2009
|