కూటమికి సెటిలర్ల సెగ!
తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి, టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడానికి సెట్లర్లు సానుకూలంగా ఉన్నప్పటికీ తమ ఆధిపత్యం ఉన్న నియోజకవర్గాలను టిఆర్ఎస్ కు కేటాయించడాన్ని మాత్రం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, ఎల్ బి నగర్, ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాలలో సెట్లర్ల సంఖ్య ఎక్కువగా ఉందని, ఆ నియోజకవర్గాలను ఎటువంటి పరిస్థితులలోను టిఆర్ఎస్ కు కేటాయించరాదని కోరుతూ ఆ ప్రాంతాలకు చెందిన టిడిపి కార్యకర్తలు చంద్రబాబు నివాసం ముందు బైఠాయించారు.
మహేశ్వరం నియోజకవర్గం టిడిపి కార్యకర్తలు ఒక దశలో చంద్రబాబు నివాసంలోకి దూసుకువెళ్ళడానికి గేట్లు ఎక్కుతుంటే భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. మహేశ్వరంలో కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డిని గెలిపించడం కోసం కాంగ్రెస్, టిఆర్ఎస్ కుమ్మక్కు అయ్యాయని ఆరోపిస్తూ ఆ ప్రాంత టిడిపి కార్యకర్తలు చంద్రబాబు నివాసం ముందు నినాదాలు చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో తన అభ్యర్థిగా టిఆర్ఎస్ ఒక డమ్మీ అభ్యర్థిని ప్రకటించిందని, కాంగ్రెస్ ను గెలిపించాలనే కుట్ర దీని వెనుక ఉందని వారు ఆరోపించారు.
కాగా, కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి తన అభ్యర్థిగా సుదర్శన్ పేరును టిఆర్ఎస్ నాయకత్వం ప్రకటించగా పెద్ద సంఖ్యలో చంద్రబాబు నివాసం వద్ద చేరిన టిడిపి సెట్లర్లు అక్కడికి వచ్చిన టిఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మల్కాజిగిరి నుంచి ఎన్ఆర్ఐని టిడిపి అభ్యర్థిగా నిలబెట్టనున్నట్లు తెలిసి ఆ నియోజకవర్గం టిడిపి కార్యకర్తలు చంద్రబాబు నివాసం వద్ద నినాదాలు చేశారు. స్థానికంగా ఉన్నవారికే టిక్కెట్ ఇవ్వాలని వారు కోరారు.
Pages: -1- 2 News Posted: 27 March, 2009
|