మహా సిగపట్లు ఎవరికి లాభం?
భావ సారూప్యత లోపించడం, ఎత్తుకు పై ఎత్తు అన్నట్టుగా వ్యవహరించడం, రాజకీయ నిబద్ధత లేకపోవడంతో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భువనగిరి, నల్గొండ స్థానాల్లో వచ్చిన మార్పు సిపిఐ, సిపిఎంల మధ్య వైరుధ్యాలకు, ఓడించే వ్యూహాలకు తార్కాణంగా కనిపిస్తోంది. మహాకూటమిలో సీట్ల ప్రక్రియ సక్రమంగా జరగని కారణంగా భాగస్వామ్య పక్షాల మధ్య వైరుధ్యాలకు ఆజ్యం పోసినట్టయింది. ఓటు బలాన్ని కూడగట్టుకోవడంలో ఉమ్మడి వ్యూహం లేకుండా పోతోంది. తెలంగాణ వాదానికి నీళ్లొదిలిన కూటమి భాగస్వామ్య పక్షాలలో రాజకీయ స్వార్ధ ప్రయోజనం అజెండాగా మారిపోయింది. ఇటీవలి పరిణామాలు కూటమి సానుకూల అంశాలను బలహీన పరచి, విరోధులను బలోపేతం చేసేవిగా ఉన్నాయి. బలం ప్రాతిపదికన సీట్ల పంపిణీకి అవకాశం లేని పరిస్థితులకు కారణమైన తెలుగుదేశం, టిఆరెస్ ల తీరు కమ్యూనిస్టులను ఇరకాటంలో పడవేసింది. సిద్ధాంతాలను పక్కన పెట్టిరాజకీయ ప్రయోజనం పొందాలని భావించిన ఉభయ కమ్యూనిస్టులు కూటమి పరిణామాల పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ను ఓడించే బలాన్ని కూటమి కూడగట్టుకుంటుందాఅనే ప్రశ్న రాజకీయ విశ్లేషకుల్లో ఉత్పన్నం అవుతోంది. కూటమి భాగస్వామ్య పక్షాల కార్యకర్తలు కలిసి పనిచేయగలరా అన్నది కూడా అనుమానమే. తెలంగాణ జిల్లాల్లో ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలోనే మిత్ర పక్షాలకు అధిక సీట్లు కేటాయించడంతో పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. రాష్ట్ర ప్రజలు శాంతి, సౌభాగ్యం, ఆనందం చక్కని భవిష్యత్ ను కోరుకుంటూండగా, రాజకీయ పార్టీరలు మాత్రం ఏదో ఒక రకంగా ఓటరును ఆకర్షించి గట్టెక్కాలని భావిస్తున్నాయి. జనాకర్షక మేనిఫెస్టోల రూపకల్పనపై దృష్టి కేంద్రీకరించాయి. అభివృద్ధి, సంక్షేమం తమ మేనిఫెస్టో అని కాంగ్రెస్ ప్రకటించగా, కలర్ టెలివిజన్, నగదు చెల్లింపు హామీలను తెలుగుదేశం ప్రకటించింది. మరోవైపు ప్రజారాజ్యం పార్టీ వంద రూపాయలకే వంట సరుకులు, వంట గ్యాస్, సామాజిక న్యాయం అంటోంది. ఈ మేనిఫెస్టోలపై ఓటరు తీర్పు వెలువడే రోజులు కూడా దగ్గరపడుతున్నాయి.
Pages: -1- 2 News Posted: 31 March, 2009
|