ఇండిపెండెంట్లదే పైచేయి?
హైదరాబాద్: రాష్ట్రంలో ఈ సారి హంగ్ అసెంబ్లీ సూచనలు కనిపిస్తున్నాయి. ఫలితంగా కొత్త అసెంబ్లీలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలదే కీలకపాత్ర కానుంది. ఈ సారి ఎన్నికల్లో, అనూహ్యమైన రీతిలో, 40 నుంచి 50 మంది ఇండిపెండెంట్ అభ్యర్ధులు గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటులో వారిదే నిర్ణయాత్మక పాత్ర అవుతుంది. బయటకు త్రిముఖ పోటీగా కనిపిస్తున్నప్పటికీ, దాదాపు 150 నియోజకవర్గాల్లో చతుర్ముఖ పోటీ జరిగే సూచనలున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్ధిత్వాన్ని పొందలేని సమర్దులు పెద్ద సంఖ్యలోనే ఇండిపెండెంట్లుగా బరిలో దిగుతున్నారు. పునర్విభజన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా కొత్త తరానికి రాజకీయ అవకాశాలు లభిస్తాయని ఆశించారు. కాని పాత పార్టీలన్నీ పాత అభ్యర్ధులకే ఎక్కడో ఒకచోట టిక్కెట్లిచ్చి బరిలో దింపాయి. సరికొత్త రాజకీయ వ్యవస్థ ఆవిర్భావానకి రాజకీయ పార్టీలే గండి కొట్టాయి.
పార్టీల అధినేతల సొంత వ్యక్తులు, అనుచరులకే సీట్లు దక్కాయి. కాని పాత తరం నాయకులను, అధి నాయకుల అనుచరులను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఈ రాజకీయ పరిణామాలతో టిక్కెట్లు దక్కని సీనియర్లు పెద్ద సంఖ్యలో తిరుగుబాటు బావుటాలు ఎగురవేశారు. ప్రజాబలం, ఆర్ధిక, సామాజిక పట్టున్న రెబెల్స్ అన్ని పార్టీలకు తలనొప్పిగా పరిణమించారు. ఇప్పటికే త్రిముక పోటీతే సతమతమవుతున్న పార్టీలకు నాలుగో అభ్యర్ధి బరిలోకి దిగడం ఇబ్బందికరమయింది. మరోవైపు సంక్షేమ పథకాలే తిరిగి తమను గట్టెక్కిస్తాయన్న అధికార పార్టీ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. కాంగ్రెస్ పథకాలకు మించి మరిన్నిసంక్షేమ పథకాలను అమలుచేస్తామంటూ తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలు ముందుకు వచ్చాయి. వైఎస్ పథకాలన్నీ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారానే అమలయ్యాయి. వాటి దయాదాక్షిణ్యాల మేరకే లబ్ధిదారులకు పథకాలు మంజూరయ్యాయి. ఆరోగ్యశ్రీ ప్రారంభమై ఆరు మాసాలే గడిచింది. దాని ప్రభావం ఓటర్ల మీద కనిపించడం లేదు.
Pages: 1 -2- News Posted: 31 March, 2009
|