మావోయిస్టుల మౌనం ఎందుకు?
లోకల్ గెరిల్లా స్క్వాడ్ (ఎల్ఎస్ జి)లు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు (ఓఒబి), ఛత్తీస్ గఢ్ నుంచి ప్రవేశించి విస్తృతంగా విధ్వంసకాండకు పాల్పడవచ్చునని పోలీసు వర్గాలు సూచించాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలలో మావోయిస్టులు తిరిగి సమీకృతమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని ఆ వర్గాలు అంటున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు అధిక సంఖ్యలో (250 మందికి పైగా సాయుధులు) సమీకృతం కావడం ఆందోళన కలిగిస్తున్న మరొక అంశం.
తిరుగుబాటు దళాల ఏరివేతకై పారామిలిటరీ, సిఆర్ పిఎఫ్, ఎపిఎస్ పి, గ్రేహౌండ్స్ దళాలు, స్థానిక పోలీసులు అటవీ ప్రాంతాలలో విస్తృతంగా గాలిస్తున్నారు. మరొక వైపు ఎఒబి సంక్లిష్టమైన మైదాన ప్రాంతం కావడంతో ఫీల్డ్ క్రాఫ్ట్ కార్యకలాపాలకు అంతరాయం వాటిల్లుతున్నది. 'పొరుగు రాష్ట్రాలతో సమన్వయంగా చర్యలు తీసుకోవడం, నక్సల్స్ కదలికలపై సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం వంటి కార్యక్రమాలను ముమ్మరం చేశాం' అని మావోయిస్టుల బెడద ఉన్న ఒక జిల్లా ఎస్ పి చెప్పారు.
దట్టమైన అటవీ ప్రాంతాలలో కొరియర్లు, మావోయిస్టు సానుభూతిపరులపై నిఘా వేసి ఉంచడమే కాకుండా మావోయిస్టులతో సంబంధాలు ఉన్న గిరిజన యువజనులను పోలీసులు బైండోవర్ కూడా చేస్తున్నారు.
ఎఒబిలో ప్రాంతంలో వారి ప్రభావానికి ఎక్కువగా గురయ్యే జిల్లాలలో కోరాపుట్, రాయగడ, మల్కనగిరి, గంజామ్, విశాఖ రూరల్, శ్రీకాకుళం, విజయనగరం ఉన్నాయి. ఖమ్మం - ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతం కూడా సున్నితమైన ప్రాంతమే. ప్రతిసారీ ఎన్నికలలో మావోయిస్టులు బహిష్కరణకు పిలుపు ఇస్తూనే ఉంటారు. ఓట్లు వేయకుండా జనంపై నక్సల్స్ ఒత్తిడి తీసుకువస్తూ ఉంటారు. కాని ఈ పర్యాయం, మావోయిస్టులు 2004 ఎన్నికలకు ముందు వలె భీతాహం సృష్టించలేదు.
Pages: -1- 2 News Posted: 4 April, 2009
|