స్థానికులు దక్కించుకుంటారా?
తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఎన్టీఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు గల ఎంవివిఎస్ మూర్తి, పురందరీశ్వరి రాకతో కాస్త ఇబ్బంది పడ్డారు. గత ఎన్నికల్లో పరాజయం పాలైన మూర్తి ఈ ఎన్నికల్లో ఏ విధంగానైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు. అయితే నగరంలో తెలుగుదేశం పార్టీ గతంలో కంటె బలం పుంజుకున్నా, ఎమ్మెల్యే అభ్యర్ధుల ఎంపికలో అధిష్టావర్గం వ్యూహాత్మకంగా వ్యవహరించలేక పోయిందన్న వాదన వినిపిస్తోంది. దీనివల్ల పార్టీ ఆశించిన ఫలితం దక్కుతుందా, లేదా, అనేది చర్చనీయాంశమయింది. ఇక ప్రజారాజ్యం పార్టీ విషయానికి వస్తే, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గంలో బిసిలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ సీటును బిసిలకు ఇస్తే విజయం చేరువ అవుతుందన్నది పరిశీలకుల అభిప్రాయం. ప్రజారాజ్యం పార్టీ ఈ ఫార్ములాను అనుసరించినా, చివరి వరకూ అభ్యర్ధికోసం అన్వేషించి, రాజకీయాలకు తాజా అయిన పల్లా శ్రీనును పోటీకి దించింది. తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం కుమరుడైన శ్రీను విద్యాధికుడు. పార్లమెంటు స్థానానికి పోటీ చేయవలసి రావడంతో పార్టీ శ్రేణులను సమీకరించుకునే పనిలో నిమగ్నమై వున్నారు.
విశాఖలో స్థానిక నినాదాన్ని లేవనెత్తిన డి.వి.సుబ్బారావు బిజెపి అభ్యర్ధిగా ఎంపిక కావడం పట్ల నగరంలో చాలామంది హర్షం వ్యక్తం చేశారు. ఉన్నత వర్గాలు, విద్యావంతులతో పాటు కొన్ని సామాజిక వర్గాలు సుబ్బారావుకు మద్దతు పలికాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి సుబ్బారావునే ఎన్నుకోవాలన్న అభిప్రాయం కూడా చాలామందికి వచ్చింది. ఇంతలోనే ఆయన క్రికెట్ ఆడుతూ కింద పడిపోయి, కాలు ఫ్రాక్చర్ కావడంతో ఆసుపత్రిపాలయ్యారు. ఏది ఏమైనా, విశాక పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ సారి గట్టి పోటీయే వుంది. అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప కాంగ్రెస్ లేదా తెలుగుదేశం అభ్యర్ధి గెలుపు ఖాయమని పరిశీలకుల అభిప్రాయం.
Pages: -1- 2 News Posted: 5 April, 2009
|