తళతళ మెరవని తారలు
ఇక 'ఊర్వశి' శారద, సత్యనారాయణ కేసులు కూడా ఇందుకు భిన్నమేమీ కావు. టిక్కెట్లపై ఆశతో తెలుగు దేశం పార్టీ (టిడిపి)కి రాజీనామా చేసి కాంగ్రెస్ లో వారు చేరారు కాని వారిని నిర్లక్ష్యం చేశారు. 'గెలుపు గుర్రాలకే టిక్కెట్లని కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం స్పష్టం చేసిన తరువాత మంగళగిరి అసెంబ్లీ, బందరు లోక్ సభ స్థానాలపై వారు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి' అని కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకుడు ఒకరు అన్నారు. టిక్కెట్ల కేటాయింపు విషయంలో సినీ తారలకు ప్రాధాన్యం ఉంటుందని ఆదిలో అంతా ఊహించారు. 'విప్లవ నటుడు' ఆర్. నారాయణమూర్తి కాకినాడ లోక్ సభ సీటుపై కన్ను వేశారు. కాని ఆయనను అలక్ష్యం చేశారు. 'పిఆర్పీ టిక్కెట్ పై హీరో రవితేజ జగ్గంపేట నుంచి, హాస్య నటుడు బ్రహ్మానందం పాలకొల్లు నుంచి పోటీ చేస్తారనే మాట వినిపించింది. కాని చిరంజీవి స్వయంగా పాలకొల్లులో బరిలోకి దిగారు' అని సినీ పరిశీలకుడు ఒకరు పేర్కొన్నారు.
సునీల్, భానుచందర్, గిరిబాబు, మరికొందరి పేర్లు కూడా టిక్కెట్ల విషయంలో వినిపించాయి. కాని వారిని అదృష్టం వరించలేదు. ఇక బాలకృష్ణ, పవన్ కల్యాణ్, నాగేంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్ర నటులు, తారకరత్న, కల్యాణ్ రామ్ వంటి వర్ధమాన నటులు తమను తాము ప్రచారానికి మాత్రమే పరిమితం చేసుకున్నారు. 'యువగర్జన ర్యాలీలో బాలకృష్ణ ప్రసంగానికి అమోఘమైన రీతిలో స్పందన రావడంతో రాజమండ్రి లోక్ సభ స్థానానికి ఆయన పోటీ చేయగలరని అందరూ ఊహించారు' అని టిడిపి తూర్పు గోదావరి జిల్లా నాయకుడు ఒకరు చెప్పారు.
అయితే, కొందరు తారలకు ప్రచారం విషయంలో సరైన రీతిలో చైతన్యం కలిగించలేదు. 'బాలకృష్ణ తన రోడ్ షోలలో తొడ కొట్టడం, మీసం మెలివేయడం వంటివి చేస్తున్నా అభ్యర్థుల గురించి లేదా టిడిపి సంక్షేమ పథకాల గురించి చెప్పవలసి వచ్చేసరికి మాటల కోసం తడుముకుంటున్నారు' అని పరిశీలకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఇక జయసుధ కాంగ్రెస్ జెండా పట్టుకున్నప్పటికీ సికింద్రాబాద్ లో ప్రచారం చేసేటప్పుడు తాను చెప్పవలసిన మాటలను సరిగ్గా చెప్పలేకపోతున్నారు. 'గతంలో ఎంజిఆర్, ఎన్టీఆర్, రాజకుమార్ వంటి నటులు రాజకీయ రంగస్థలిపై తమ సత్తా ప్రదర్శించడం చూశాం. కాని ప్రస్తుతం చాలా మంది నటులకు ప్రధాన సమస్యలపైన, ప్రజల సాంఘిక సమస్యలపైన స్పష్టత కొరవడుతున్నది. వారు ఎన్నికల ర్యాలీని ఆకర్షణీయం చేయగలరు లేదా అధిక సంఖ్యలో జనాన్ని రప్పించగలరు. అంతే' అని ఒక పరిశీలకుడు వ్యాఖ్యానించారు.
Pages: -1- 2 News Posted: 7 April, 2009
|