కొంప ముంచే సోదర ప్రేమ!
2004 ఎన్నికలకు ముందు రైవాడ నీటి ఉద్యమానికి సారథ్యం వహించిన, ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న మంత్రి రామకృష్ణకు ఇప్పుడు అనకాపల్లి రాజకీయాలలో పెదబాబు పోషిస్తున్న పాత్ర కారణంగా తన గవర కులస్థులలో కూడా మంచి పేరు లేదు. కాగా, తన ఆధిపత్యం సాగుతున్నట్లు వస్తున్న ఆరోపణలను పెదబాబు ఖండిస్తూ, ప్రజలు మూర్ఖులేమీ కారని, తమ వోటు హక్కును తెలివిగా ఉపయోగించుకుంటారని అన్నారు. ఇక ఐదు పర్యాయాలు ఎంఎల్ఎగా, రెండు తడవలు మంత్రిగా ఉన్న జె.సి. దివాకరరెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రిలో నెగ్గవచ్చునేమో గాని ఆయన సోదరుడు జె.సి. ప్రభాకరరెడ్డి రాయలసీమలో సాగిస్తున్న అకృత్యాల గురించి విమర్శలు పుంఖానుపుంఖంగా వస్తున్నాయి. ప్రైవేట్ రవాణా సంస్థను నిర్వహిస్తున్న ప్రభాకరరెడ్డికి గనులు, సిమెంట్, విద్యుత్ ప్రాజెక్టులు, ఇతర వ్యాపారాలతో కూడా ప్రమేయం ఉంది. అయితే, వాటిని ఆయన బినామీ పేర్ల మీద సాగిస్తుంటారు. 'ప్రభాకర్ ఒత్తిడి మార్గాల గురించి అందరికీ తెలుసు కనుక ఆయన పద్ధతులు నచ్చనివారు కూడా రాజీకి రాక తప్పదు' అని ఒక ప్రతినిధి వ్యాఖ్యానించారు. పోలీసులు ఆయనపై రౌడీషీటు తెరిచారంటే ఆయనపై గల ఈ ఆరోపణ నిజమేనని తేలుతోంది కదా అని స్థానిక టిడిపి నాయకుడు ఒకరు పేర్కొన్నారు.
షబ్బీర్ అలీ సోదరుడు మహమ్మద్ నయీమ్ నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో ఎదురులేని నాయకుడుగా చలామణి అవుతున్నారు. ఆయన ప్రాబల్యం కారణంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆయన దర్శనం చేసుకుంటుంటారు. ముఖ్యమైన సివిక్, నీటిపారుదల కాంట్రాక్టు పనులను చేజిక్కుంచుకోవడంతో పాటు షబ్బీర్ సోదరుడు తన పనులతో మంత్రిని వోటర్లకు దూరం చేశారని, ఇది మంత్రికి నష్టదాయకం కావచ్చునని కొన్ని వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని కేసులలో ఈ పాత్రలు మారాయి. ఆ సందర్భాలలో ఎన్నికలలో తమ సోదరుల ఓటమికి మంత్రులు కారకులు కావచ్చు.
ఉత్తర కోస్తా ఆంధ్రలో ఎన్నికల బరిలో ఉన్న మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, శత్రుచర్ల విజయరామరాజు సోదరులకు పరిస్థితి గడ్డుగా పరిణమించవచ్చు. మరికొన్ని సందర్భాలలో అన్నదమ్ములది ఒకటే మాటగా చలామణి అవుతుంటుంది. ఇందుకు ఆనం సోదరులే ఉదాహరణ. వారు ఎన్నడూ పరస్పర ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించరు.'ఆనం ఆధిపత్యాన్ని యథాతథంగా కొనసాగించడమే వారికి కావలసింది. ఇందుకోసం వారు ఏ రాజకీయం చేయడానికైనా వెనుకాడరు. దేవాదాయ భూములపై ఆనం సోదరులకు ఆధిపత్యం ఉన్నదనే ఆరోపణలు ఉన్నాయి. అయినా వారు ఆందోళన చెందవలసిన పనే లేదు' అని కొన్ని వర్గాలు పేర్కొన్నాయి. ఆ వ్యక్తుల 'హస్తం' ఎన్నికలలో వారి సోదరులైన మంత్రుల పతనానికి కారణం అవుతుందా అనేది సమాధానం దొరకని ప్రశ్న.
Pages: -1- 2 News Posted: 8 April, 2009
|