రైలింజన్ లో అసమ్మతి పొగ!
మా పార్టీ రహస్యాలన్నీ లీకవుతున్నాయని చిరంజీవి అనేక సార్లు అన్నప్పటికీ అందుకు కారణాలను విశ్లేషించలేక పోయారు. ప్రజరాజ్యంలో స్వపక్షం గుట్టును కాపాడే యంత్రాంగం లేకపోవడమే ప్రధాన కారణం. ఆయనే పార్టీ ఆఫీసుకు రావడం అరుదైనప్పుడు అక్కడి గుట్టు మట్లను ఓ పట్టు పట్టడం ఎవరికైనా తేలికే! చిరంజీవి పార్టీ కార్యాలయానికి వస్తే ఎగబడిపోవడం, ఆయన టూర్ లకు వెళ్తే ఆఫీసువైపు చూడకపోవడం మామూలైపోయింది. ఆ సమయంలో ఎవరైనా ఆఫీసులో ఏ గదిలోకైనా నిరాటంకంగా వెళ్లి రావచ్చు. ఎలాంటి రహస్యాలనైనా సంగ్రహించవచ్చు. టిక్కెట్ల కేటాయింపు మొదలైన దగ్గర్నుంచి అసమ్మతి తలెత్తి, ఎవరో ఒకరు ధర్నాలు, ఆత్మాహుతి యత్నం చేయడం నిత్యకృత్యం కాగా, పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు గేట్లు మూసివేయడం తప్ప ఎలాంటి భద్రత ఏర్పాట్లు అక్కడ లేవు.
'మా అభిప్రాయాలకు పార్టీలో విలువ లేదు' అని పార్టీకి గుడే బై చెప్పిన ప్రతి ఒక్కరూ అన్నారు. మంచి చెప్పినా పట్టించుకో లేదన్నారు. విధానపరమైన చర్చలే జరగడం లేదన్నారు. ముఖ్యమైన సమావేశాలకు ఆహ్వానమే అందలేదన్నారు. నాయకత్వ లోపం బయటపడింది ఇక్కడే! ఎవరు వెళ్లిపోయినా వారిని కోవర్టులుగానే పేర్కొన్నారు తప్ప, వారిని దారికి తెచ్చుకునే ప్రయత్నాలు జరిగితే పార్టీకి ఎంతో మేలు జరిగేదంటున్నారు. ఇప్పటికైనా చిరంజీవి పార్టీలో సంక్షోభాన్ని గుర్తించి, ఆత్మ విమర్శ చేసుకుని, పొరపాట్లను చక్కదిద్దే ప్రయత్నాలు జరగాలంటున్నారు. ప్రభాకర్ ఆరోపణలకు అరవింద్ ప్రతిస్పందన పార్టీ అభిమానులకే సంతృప్తి కరంగా లేదు. ఇకనైనా ఆగ్రహాన్ని వదలి నిగ్రహంతో వ్యవహరించాలని పరిశీలకులు సూచిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 10 April, 2009
|