అయోమయ 'రాజ్యం'!
టిక్కెట్ ఆశించిన అభ్యర్ధులు తాము ఫలానా సామాజికవర్గం అని దరఖాస్తులలో పేర్కొన్న దానిని మాత్రమే ప్రమాణికంగా తీసుకుని టిక్కెట్లు ఇచ్చామని, వారు నిజంగా బిసిలా, కాదా , వారి దగ్గర ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయో, లేదో తమకు తెలియదని పార్టీ అగ్ర నాయకులు వాదిస్తున్నారు. దీనికితోడు పార్టీ బలహీనంగా ఉందని సర్వే నివేదికల్లో వెల్లడైన చోట్ల మాత్రమే లెక్కకోసం బిసిలకు టిక్కెట్లు ఇచ్చారని బిసి సంఘాలు చేస్తున్న ఆరోపణలకు ప్రజారాజ్యం నాయకులు జవాబివ్వలేక పోతున్నారు. ప్రత్యర్ధి పార్టీలకు బలమైన అభ్యర్ధులున్న చోట ప్రజారాజ్యం బలహీనమైన అభ్యర్ధులను నిలబెట్టిందని పరకాల ప్రభాకర్ చేసిన ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా మగళవారం నల్గొండ జిల్లా భువనగిరి అభ్యర్ధి వ్యవహరం పార్టీని మరింత ఆత్మరక్షణలోకి నెట్టేసింది.
తాను గెలిచే అభ్యర్ధిని కాదని తెలిసే, తన ప్రత్యర్ధితో కుమ్మక్కై, తనకు టిక్కెట్ ఇచ్చారని భువనగిరి లోక్ సభ నియోజకవర్గం ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధి చంద్రమౌళి గౌడ్ చేసినట్టు చెబుతున్న వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. పార్టీ నాయకులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్, తెలుగుదేశం కుట్ర వుందని ఆరోపించి వారు చేతులు దులిపేసుకున్నా, ఈ ఉదంతం ఓటర్లపై ఎటువంటి ప్రభావం చూపుతుందోనని పార్టీ నాయకత్వం ఆందోళన చెందుతోంది.
Pages: -1- 2 News Posted: 15 April, 2009
|