అహంకరిస్తే పతనమే!
హైదరాబాద్: అహంభావం, అహంకారం రాజకీయాల్లో నాయకుల పతనానికి నాంది పలుకుతాయి. నాడు ఎన్టీఆర్ అహంభావంతో అధికారాన్ని చేజార్చుకోగా, నేడు వైఎస్సార్ అదే బాటలో నడుస్తున్నారు. గత ఐదేళ్లలో ఎంతో కష్టపడి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుపరచిన వైఎస్ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మేలైన పరిపాలన అందించారు. కాని ఆ పథకాల కంటె ఆయన అహంకారం, అహంభావాలకే ప్రజల్లో ఎక్కువ ప్రచారం జరుగుతున్నట్టు కనిపిస్తోంది. అలాగే తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు 2004లో సర్వం తానే అన్నట్టు వ్యవహరించారు. తాను చేపట్టిన పథకాలే తనను గెలిపిస్తాయని ధీమాపడ్డారు. ఎమ్మెల్యేలను, పార్టీ నాయకులను చులకనగా చూశారు. ఆయనపట్ల ప్రజల వ్యతిరేకతకు అదే కారణమయింది.
1999లో ఎన్టీఆర్ ప్రభావం లేకుండా తాను అధికారంలోకి వచ్చానని, ప్రజలు తన వెంటే ఉన్నారని, ఈ రాష్ట్రానికి తానే శాశ్వత ముఖ్యమంత్రినని అహంకరించారు. తనను తాను రాష్ట్రానికి సిఇఓగా ప్రకటించుకున్నారు. అదే ఆయన రాజకీయ పతనానికి నాంది పలికింది. అంతకుముందు 1989లో ఎన్టీరామారావు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. తాను చెప్పిందే వేదమని, ప్రజలు దానినే ఆచరిస్తారని అనుకున్నారు. ఒక్క కలంపోటుతో 32మంది మంత్రులను తొలగించారు. అసమర్ధులకు మంత్రి పదవులిచ్చారు. ఆ అతి విశ్వాసం వికటించి, ప్రజలు ఆయనకు గుణపాఠం చెప్పారు. ఇక ప్రస్తుతానికి వస్తే, ఈ సారి కాంగ్రెస్ గెలిచినా, ఓడినా బాధ్యత తనదేనని వైఎస్ ప్రకటించారు. 240కి పైగా అసెంబ్లీ, 36 లోక్ సభ స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
Pages: 1 -2- News Posted: 18 April, 2009
|