స్థానికాంశాలకు గుడ్ బై?
బుడమేరుకు ఎప్పుడు వరదలు వచ్చినా జలార్ణవంగా మారే కాలనీలు విజయవాడలో అనేకం ఇప్పటికీ ఉన్నాయి. కాలువ తీరంలో నివసించేవారు వేలాది మంది ఒకటి రెండు రోజుల పాటు తాత్కాలిక తుపాను సహాయ శిబిరాలకు తరలి వెళ్ళవలసి వస్తున్నది. వాంబే కాలనీ ఇళ్ళలో కనీస సౌకర్యాలు ఏవీ లేవు. వరుసగా రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిస్తే నడుము లోతు నీళ్ళలో ఇళ్ళలో జనం నివసించవలసిందే. ఒక్క అభ్యర్థి కూడా స్వార్థానికైనా ఈ విషయం ప్రస్తావించకపోవడం శోచనీయమని వీర్రాజు అనే స్థానిక యువకుడు అన్నాడు.
తెలుగుదేశం పార్టీ (టిడిపి), ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) వంటి ప్రతిపక్షాలు చాలా నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ఖరారు చేయడాన్ని ఆలస్యం చేయడమే కాకుండా పలు చోట్ల కొత్తవారిని నిలబెట్టాయి. దీనితో స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అభ్యర్థులకు ఏమాత్రం తెలియడం లేదు. లగడపాటి రాజగోపాల్ తో పోటీ చేస్తున్న వంశీ మోహన్ (టిడిపి), చనుమోలు రాజీవ్ (పిఆర్పీ) విజయవాడకు మాత్రమే కాకుండా రాజకీయాలకు కూడా కొత్తవారే.
'రాజగోపాల్ విఫలుడైన సమస్యలను వారు చేపట్టి ఆయనను ఎలా ఢీకొనగలరు' అని మాజీ మేయర్ టి. శకుంతల అడుగుతున్నారు. స్థానిక సమస్యల గురించి సరైన అవగాహన లేకపోవడంతో అభ్యర్థులు అవినీతి, ఆశ్రిత పక్షపాతం వంటి సార్వత్రిక సమస్యలపైనే ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 21 April, 2009
|