బెడ్ ల కోసం రోగుల క్యూ
డిమాండ్, సప్లై మధ్య అంతరం లేదని, ఒకవేళ ఉన్నా దానిని సర్దుబాటు చేస్తున్నామని ఆసుపత్రుల అధికారులు కొందరు చెబుతున్నారు. కాని ఈ సమస్య ఉందని ఒప్పుకోవడానికి వెనుకాడని వారు మరికొందరు ఉన్నారు. 'ఆరోగ్యశ్రీ ప్రారంభించడానికి ముందు నుంచే మా వద్ద బెడ్ ల కొరత ఉంటున్నది. మాకు విస్తరణ యోచన ఉంది. అయితే, అది ఒక్క రోజులో జరిగే పని కాదు కదా' అని అపోలో ఆసుపత్రి సిఇఒ డాక్టర్ హరిప్రసాద్ చెప్పారు. హైదరాబాద్ లో 650 పడకలు గల తమ ఆసుపత్రి ఎప్పుడూ నిండిపోయి ఉంటుందని ఆయన తెలిపారు. గ్లోబల్ ఆసుపత్రి సిఇఒ డాక్టర్ ఎం. వీరప్రసాద్ 'కొంత నిరీక్షణ వ్యవధి' ఉంటున్నదని అంగీకరిస్తూ, డిమాండ్, సప్లై మధ్య అంతరాన్ని ఇప్పటి వరకు ఏదోవిధంగా సర్దుబాటు చేస్తున్నట్లు చెప్పారు. 'ఉదాహరణకు ఏంజియోగ్రామ్ కోసం ఒక రెగ్యులర్ రోగిని చేర్చుకుంటే అతను ఒక వారంలోగా ఇంటికి వెళ్ళిపోతాడు. అదే ఆరోగ్యశ్రీ రోగి విషయంలో అధికారిక ధ్రువీకరణకు ముందు ప్రక్రియలకు, ఆరోగ్యశ్రీ నుంచి క్లియరెన్సులకు అదనంగా మూడు నుంచి ఐదు రోజుల వ్యవధి అవసరం అవుతుంటుంది' అని ఆయన వివరించారు.
ఈ పరిశ్రమ వార్షిక వృద్ధి రేటు 20 శాతం ఉంటుండగా పడకల సంఖ్య మాత్రం ఆ దామాషాలో పెరగడం లేదని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. 'ఎవరూ తేలికగా పడకలను పెంచలేరు. మౌలిక సదుపాయాల కల్పన కూడా కావలసి ఉంటుంది' అని హెల్త్ కేర్ పరిశ్రమ పరిశీలకుడు ఒకరు సూచించారు. ఆసుపత్రులు టూ టైర్, త్రీ టైర్ నగరాలలో తమ విస్తరణ పథకాలను అమలు జరపడానికి పూనుకుంటే నగరంలోని ఫైవ్ స్టార్ ఆసుపత్రులపై భారం కొంత తగ్గగలదని ఆయన అన్నారు.
అయితే, 400 పడకల వసతి, 65 శాతం ఆక్యుపెన్సీ ఉంటున్న కేర్ వంటి కొన్ని ఆసుపత్రుల అధికారుల వాదన మరొక విధంగా ఉంది. అటువంటి కొరత ఏమీ లేదని, అందుకు భిన్నంగా చికిత్సలలో సాధించిన పురోగతి వల్ల ఆసుపత్రిలో రోగులు ఉండవలసిన వ్యవధి గణనీయంగా తగ్గిపోయిందని వారు చెబుతున్నారు.
Pages: -1- 2 News Posted: 23 April, 2009
|