ఫిరాయింపుదారుల ఓటమి
తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన నూకారపు సూర్యప్రకాశరావుకు టిక్కెట్ ఇచ్చి అందరినీ దిగ్భ్రాంతిలో ముంచెత్తారు. హైదరాబాద్ లో భూమి కుంభకోణంలో సూర్యప్రకాశరావుకు పాత్ర ఉందని ఆరోపిస్తూ చంద్రబాబు నాయుడు రెండు సంవత్సరాల క్రితం రోజంతా ధర్నా నిర్వహించిన విషయాన్ని ఓటర్లు మరచిపోలేదు. అందువల్ల అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గంలో సూర్యప్రకాశరావును నిలబెట్టాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని ఓటర్లు హర్షించలేదు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సబ్బం హరి 52099 ఓట్ల ఆధిక్యంతో సూర్యప్రకాశరావును ఓడించారు.
అదే విధంగా తెలుగు దేశం పార్టీలో మైనారిటీ విభాగం మాజీ అధ్యక్షుడు సయ్యద్ యూసుఫ్ అలీ తన పదవికి రాజీనామా చేయకుండానే చివరి క్షణంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరి జహీరాబాద్ లోక్ సభ టిక్కెట్ పొందగా ఆయనను కూడా ఓటర్లు తిరస్కరించారు. యూసుఫ్ అలీ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ చేతిలో 17407 ఓట్ల తేడాతో ఓడిపోక తప్పలేదు.
అయితే, ఫిరాయింపుదారులలో అదృష్టవంతులు కొందరు లేకపోలేదు. చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీలో చేరి టిక్కెట్లు పొందిన టిడిపి మాజీ నాయకులు కొందరు ఓటర్ల విశ్వాసాన్ని చూరగొనగలిగారు. అటువంటివారిలో గుత్తా సుఖేందర్ రెడ్డి (నల్లగొండ లోక్ సభ నియోజకవర్గం), చెరుకు ముత్యంరెడ్డి (దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం) ఉన్నారు. సుఖేందర్ రెడ్డి సిపిఐ సీనియర్ నాయకుడు సురవరం సుధాకరరెడ్డిని 150982 ఓట్ల ఆధిక్యంతో ఓడించగా ముత్యంరెడ్డి టిఆర్ఎస్ అభ్యర్థి ఎస్. రామలింగారెడ్డిపై 2640 ఓట్ల తేడాతో గెలుపొందారు.
Pages: -1- 2 News Posted: 18 May, 2009
|