తెలంగాణా తెల్లబోయింది
ఎనిమిది సంవత్సరాల కిందట కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించిన కాలంలో తెలంగాణలో ఆ పార్టీ పెను సంచలనాలు సృష్టించింది. పార్టీ ఏర్పాటైన కొద్ది కాలానికే వచ్చిన స్థానిక ఎన్నికల్లో టిఆర్ఎస్ అటు కాంగ్రెస్, ఇటు అధికారంలో ఉన్న టిడిపిని బెంబేలెత్తించింది. శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికీ, ఎమ్మెల్యే పదవికీ, తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి కెసిఆర్ రాజీనామా చేసి సిద్దిపేట నియోజకవర్గం నుంచి నిలిస్తే జనం ఆయనకు బ్రహ్మరథం పట్టారు. సంచలనం ఎంత దూరం వెళ్ళిందంటే 2004 ఎన్నికల్లో టిఆర్ఎస్ తో మైత్రి లేకపోతే తెలంగాణలో అడ్రస్ గల్లంతు అవుతుందన్న భయంతో కాంగ్రెస్ నేతలు కెసిఆర్ కోరిన హిరణ్యాక్ష కోరికలన్నింటికీ తలొగ్గి వెంటేసుకు తిరగాల్సి వచ్చింది. ఫలితంగా తెలంగాణలో టిడిపిని రెండంకెలు మించని స్థాయికి దిగజార్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. టిఆర్ఎస్ గణనీయంగా 26 శాసనసభ, ఐదు లోక్ సభా స్థానాలు చేజిక్కించుకుంది. జనంలో తెలంగాణ వాదం ఎంత బలంగా ఉందో తెలుసుకునేందుకు ఆ ఫలితాలే ఉదాహరణ. ఆ తర్వాత కెసిఆర్ ఎన్ని ప్రకటనలు చేసినా, డెడ్ లైన్లు పెట్టినా జనం నమ్మారు.
కరీంనగర్ లో సార్వత్రిక ఎన్నికల తర్వాత రెండు పర్యాయాలు రాజీనామా చేసి బరిలో నిలిచినా ఓట్లేసి గెలిపించారు. ఇవన్నీ క్రమంగా గత చరిత్రగా మారిపోతున్నాయి. దాని ఫలితమే తనతో సహా చట్టసభల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న వారంతా మూకుమ్మడిగా పదవులకు రాజీనామాలు చేసి ఉప ఎన్నికల బరిలో నిలిచినప్పుడు 26 మంది ఎమ్మెల్యేలలో ఏడుగురు, నలుగురు ఎంపీలలో తనతో సహా మరొకరిని మాత్రమే కెసిఆర్ గెలిపించుకోగలిగారు. రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం, కేంద్రంలో యుపిఎ కూటమి అధికారంలోకి రావటంతో మరో ఐదు సంవత్సరాల పాటు తెలంగాణ వాదానికి ఫుల్ స్టాప్ పడినట్టే అని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఏమి చేయాలన్నా చట్టసభల్లో నామాత్రపు బలం ఉండటంతో కెసిఆర్ మాట చెల్లుబాటు అయ్యే అవకాశాలు అంతంత మాత్రమే అన్న అభిప్రాయం పార్టీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
ఈ పరిస్థితి ఒక్క టిఆర్ఎస్ కు మాత్రమే పరిమితం కాదు. అతి ప్రయత్నం మీద పార్టీ నేతల ఒత్తిడి మేరకు తెలంగాణకు సై అన్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఇక ముందు దాని ఊసు పొక్కకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది. తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకునేలా తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసిన నాగం జనార్దన్ రెడ్డి, కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి వారు సైతం ప్రస్తుతానికి మౌనం వహించక తప్పదు. వాస్తవానికి తెలంగాణవాదం అనేది కనుమరుగు కావటానికి వీలే లేదన్నది ఈ ప్రాంత మేధావులు, పాత్రికేయులు, కవులు, కళాకారుల నిశ్చితాభిప్రాయం. కొంతకాలం పాటు నివురుగప్పిన నిప్పులా అణగి ఉండటమే తప్ప మేధావుల నుంచి సామాన్యుల దాకా తెలంగాణ కావాలన్న దృఢమైన కోరికను రూపుమాపలేరని వారి అభిప్రాయం.
Pages: -1- 2 News Posted: 19 May, 2009
|