సామర్థ్యానికే సింగ్ ఓటు
హెచ్ఆర్ డి, సామాజిక న్యాయం, గనులు, ఆహార ప్రాసెసింగ్, తదితర మంత్రిత్వశాఖలలో కొత్తవారిని నియమించాలని ప్రధాని గట్టిగా కోరుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఈ శాఖలలో ఇప్పుడున్నవారు ఆశించిన విధంగా పని చేయలేకపోయారు. ఇక కపిల్ సిబల్, అంబికా సోని, పృథ్వీరాజ్ చవాన్, జైరామ్ రమేష్, ఆనంద్ శర్మ వంటి మంత్రుల స్థాయి పెంచాలనే ఆసక్తితో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఉన్నట్లు తెలుస్తున్నది. చిదంబరాన్ని హోమ్ మంత్రిగాను, ప్రణబ్ ముఖర్జీని విదేశాంగ మంత్రిగాను కొనసాగించాలని ఆయన అనుకుంటున్నారు. అయితే, ప్రస్తుత వాణిజ్య శాఖ మంత్రి కమల్ నాథ్ ఆర్థిక, విదేశాంగ శాఖలపై కన్ను వేసినట్లు, కపిల్ సిబల్ వాణిజ్య శాఖను లేదా హెచ్ఆర్ డి శాఖను కోరుకుంటున్నట్లు తెలుస్తున్నది.
రాహుల్ గాంధి ప్రభుత్వంలో చేరాలని మన్మోహన్ పట్టుబట్టగలరని పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఈ విషయమై నిర్ణయాన్ని రాహుల్ గాంధికే వదలివేశారు. అయితే, మంత్రిగా చేరవలసిందని స్వయంగా రాహుల్ కు విజ్ఞప్తి చేయాలని మన్మోహన్ యోచిస్తున్నట్లు తెలుస్తున్నది.
తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీని కూడా మంత్రివర్గంలో చేర్చుకోవాలని మన్మోహన్ ఆసక్తితో ఉన్నారు. 'యుపిఎ 2' సాఫీగా పని చేయడానికి ఎన్నికల ముందునాటి మిత్ర పక్షాలన్నిటికీ మంత్రివర్గంలో భాగస్వామ్యం కల్పించడం ప్రధానమని ఆయన భావిస్తున్నారు. అయితే, కేంద్రంలో పదవిని స్వీకరించాలా లేక బెంగాల్ రాజకీయాలపైనే దృష్టి కేంద్రీకరించాలా అనేది మమత తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తున్నది. కాగా తృణమూల్ అధినేత్రిని ప్రణబ్ బహుదా ప్రశంసించారు. బెంగాల్ లో వామపక్షాలను చిత్తు చేయాలనే ఆమె దృఢసంకల్పం తనను ముగ్ధుడిని చేసిందని ఆయన కాంగ్రెస్ వేదికపై చెప్పారు.
యుపిఎలోని ఇతర మిత్ర పక్షాలకు కఠినమైన షరతులను విధించాలని కాంగ్రెస్ యోచిస్తున్నది. మిత్రపక్షానికి చెందిన ఏ మంత్రికీ అదనపు శాఖలను ఇవ్వరాదని పార్టీ నిర్ణయించింది. ఏడుగురు ఎంపిలు ఉన్న ఏ పార్టీ అయినా ఒక క్యాబినెట్ మంత్రి పదవికి, ఒక సహాయ మంత్రి పదవికి అర్హం కాగలదనే సూత్రాన్ని కాంగ్రెస్ వ్యూహకర్తలు రూపొందించారు. సాధారణ మెజారిటీకి కావలసిన 272 మంది సభ్యుల సంఖ్యను 39 క్యాబినెట్, 39 సహాయ మంత్రి పదవులకు విభజించడం ద్వారా వారు ఈ సూత్రాన్ని రూపొందించారు. కేంద్ర మంత్రివర్గంలో ప్రధానితో సహా 81 మంది మంత్రులకు మించి ఉండరాదు.
Pages: -1- 2 News Posted: 19 May, 2009
|