మద్దతు కోసం పోటాపోటీ
డిఎంకె తీసుకువస్తున్న ఈ ఒత్తిడికి మమతా బెనర్జీ స్పందన కూడా ఆసక్తి కలిగిస్తున్నది. బుధవారం యుపిఎ సమావేశానికి హాజరయ్యే నిమిత్తం మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత కోలకతా నుంచి న్యూఢిల్లీకి ఒక ప్రైవేట్ విమానంలో బయలుదేరిన, తన కోర్కెలపై చాకచక్యంతో వ్యవహరిస్తారని పేరుపడిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ డిఎంకె విషయంలో వలె తన పార్టీకీ 'రివార్డు' ఇవ్వాలని కోరినట్లు తెలుస్తున్నది. అయితే, భారీ స్థాయిలో విజయం సాధించిన అనంతరం దృఢవిశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ కరుణానిధి లేదా మమత ఒత్తిడికి లొంగకపోవచ్చు. జెడి (ఎస్)ను యుపిఎలోకి చేర్చుకోవాలా వద్దా అనే అంశంపై కాంగ్రెస్ పార్టీలో చర్చ జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి తమకు అందిన దరఖాస్తులపై తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది. కాగా కూటమిని విస్తరించాలా వద్దా అనే అంశంపై యుపిఎ బుధవారం సమావేశంలో చర్చించవచ్చు ఈ సమావేశానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సిపి), నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్ సి), డిఎంక, తృణమూల్ కాంగ్రెస్ హాజరు కావచ్చని భావిస్తున్నారు.
యుపి ముఖ్యమంత్రి, బిఎస్ పి అధ్యక్షురాలు మాయావతి లక్నోలో తమ పార్టీ మద్దతు గురించి ప్రకటన చేస్తూ, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తనకు ఫోన్ చేసి 'చోటీ బహెన్' మద్దతు కావాలన్నారని వెల్లడించారు. సమాజ్ వాది మద్దతు కోరుతూ ప్రధాని ఇంతకుముందు ఇదేవిధంగా తనకు ఫోన్ చేశారని ఎస్ పి ప్రధాన కార్యదర్శ అమర్ సింగ్ తెలియజేశారు. కాగా, వామపక్షాల ఏర్పాటు చేసిన తృతీయ ఫ్రంట్ లో బిఎస్ పి సాంకేతికంగా భాగస్వామ్య పక్షంగా ఇంకా ఉన్నప్పటికీ మాయావతి తన వైఖరిని ఇంత త్వరగా మార్చుకోవడం గమనార్హం. మాయావతి, ములాయంలతో ప్రధాని ఫోన్ లో మాట్లాడిన విషయాన్ని ప్రధాని కార్యాలయం (పిఎంఒ)లోని అధికార వర్గాలు ధ్రువీకరించినప్పటికీ, వాటిలో దేనినైనా యుపిఎలోకి కాంగ్రెస్ ఆహ్వానిస్తున్నదా అనేది చెప్పడానికి నిరాకరించాయి.
Pages: -1- 2 News Posted: 20 May, 2009
|