`దేశం'లో దుమారం
హైదరాబాద్ : జోడు పదవులపై తెలుగుదేశం పార్టీలో దుమారం లేచింది. దశాబ్దాల తరబడి కష్టపడి పనిచేసిన ద్వితీయశ్రేణి నాయకులకు బాధ్యతలు అప్పగించకుండా, ప్రత్యమ్నాయ నాయకత్వం ఎదక్కుండా చేస్తున్న విధానాలకు చరమ గీతం పాడాలని తెలుగు తమ్ముళ్లు గళం విప్పారు. సీనియర్లే అన్ని పదవులనూ అలంకరిస్తూ మిగతా వారిని ఉత్సవ విగ్రహాలుగా మారుస్తున్నారన్న అసంతృప్తి పెల్లుబుకడంతో దేశం అధినేత చంద్రబాబు నాయుడు పునరాలోచనలో పడక తప్పలేదు. తమ్ముళ్ళ డిమాండ్ కు తలవంచకా తప్పలేదు. దాంతో తెలుగుదేశం శాసనసభా పక్షం (టిడిఎల్ పి) ఉపనేతలను, కార్యదర్శిని, విప్ పదవులను నియమించకుండా చంద్రబాబు వాయిదా వేశారు. పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యులుగా కొనసాగుతూ గతంలో మంత్రులుగా, లోక్ సభ సభ్యులుగా పనిచేసిన వారికే తిరిగి టిడిఎల్ పిలో వివిధ పదవులను కేటాయించాలని నిర్ణయించడం పట్ల కొందరు సీనియర్ శాసనసభ్యులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ పదవుల్లో కొత్తవారిని ఎంపిక చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.
వాస్తవానికి గురువారం టిడిపిఎల్ పి సమావేశం జరిగిన తర్వాత ఉపనేతలను, కార్యదర్శి, విప్, కోశాధికారిని నియమించడానికి చంద్రబాబు కసరత్తు చేశారు. అయితే ఉపనేతలుగా పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యులుగా కొనసాగుతున్న నాగం జనార్దన్ రెడ్డి, కె.ఇ.కృష్ణమూర్తి, పూసపాటి అశోక గజపతిరాజు, కార్యదర్శిగా ఎర్రబెల్లి దయాకర్ రావు, విప్ గా రావుల చంద్రశేఖర్ రెడ్డిని నియమించాలని చంద్రబాబు భావించారు. అయితే అన్ని పదవుల్లో వీరినే నియమించడంపై కొంతమంది సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు నేరుగా చంద్రబాబు దగ్గరకు వెళ్ళి టిడిఎల్ పి ఉపనేతలుగా కొత్తవారికి అవకాశం ఇవ్వాలని గతంలో మంత్రులుగా పనిచేసి పొలిట్ బ్యూరో సభ్యులుగా కొనసాగుతున్నవారిని ఉపనేతలుగా నియమించవద్దని కోరడంతో వీరి ఎంపికను చంద్రబాబు వాయిదా వేసినట్లు సమాచారం.
Pages: 1 -2- News Posted: 22 May, 2009
|