వైఎస్ కు కత్తి మీద సాము!
ఇది ఇలా ఉండగా, మెదక్, నల్లగొండ, గుంటూరు, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల నుంచి మంత్రుల ఎంపికలో వైఎస్ ఒక విచిత్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ జిల్లాలకు చెందిన, పాత మంత్రివర్గ సభ్యులైన మంత్రులందరికీ చోటు కల్పించినట్లయితే, కొత్త వారికి అవకాశం దక్కదు. జిల్లాలలో బలమైన నాయకులుగా ఆవిర్భవించిన జి 18 సభ్యులను ఆయన పక్కకు తప్పించగలరా అనేది ప్రశ్న. ముఖ్యంగా అసెంబ్లీలో ప్రభుత్వానికి సాధారణ ఆధిక్యం మాత్రమే ఉన్న సమయంలో ఆయన ఇలా చేయగలరా? ఆయన అలా చేయలేకపోతే ఇతర 'అర్హులైన' సభ్యుల నుంచి అసంతుష్టిని ఎదుర్కొనవలసి రావచ్చు. ఉదాహరణకు, మెదక్ జిల్లా నుంచి సునీతా లక్ష్మారెడ్డి, నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు పదవులపై ఆశలు పెట్టుకున్న సభ్యులు ఉన్నారు. సునీతా లక్ష్మారెడ్డి మూడు సార్ల నుంచి ఎంఎల్ఎగా ఎన్నికవుతున్నారు. వెంకటరెడ్డి అయితే ఇద్దరు ఎంపిలు, ముగ్గురు ఎంఎల్ఎల విజయంలో తన పాత్ర ఎంతో ఉందని చెప్పుకుంటున్నారు.
ఇక గుంటూరు జిల్లా నుంచి పాత మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, ఎం. వెంకటరమణ, కాసు కృష్ణారెడ్డి ముగ్గురినీ తీసుకున్నట్లయితే గాదె వెంకటరెడ్డి, డి. మాణిక్య వరప్రసాద్ లకు స్థానం కల్పించడం సాధ్యం కాదు.
కాపుల ప్రాబల్యం గల ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఎనిమిది మంది సీనియర్ ఎంఎల్ఎలలో నలుగురికి, అంటే కాపు కులస్థులలో 50 శాతానికి మంత్రివర్గంలో స్థానం కల్పించగలరా అనేది మరొక ప్రశ్న. వైఎస్ అలా చేయలేకపోతే ఇంకో సమస్య తలెత్తుతుంది. ఆ జిల్లాలలోనే కమ్మ కులం నుంచి కనీసం ఒకరినైనా ఆయన మంత్రిగా చేర్చుకోవలసి ఉంటుంది.
Pages: -1- 2 News Posted: 24 May, 2009
|