మళ్ళీ సేవకు వేళాయరా!
ఇప్పటికే అనేక మంది ప్రభుత్వ, ప్రభుత్వేతర సిబ్బంది మంత్రుల పేషీల్లో వ్యక్తిగత సహాయకులుగా చేరి పోవడానికి పావులు కదుపుతున్నారు. వారిలో అనేక మంది అసమర్ధులు, అవినీతిపరులనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వ్యక్తిగత సిబ్బంది నియామకంలో వడపోత పాటించని పక్షంలో కొత్త మంత్రులు కూడా రాబోవు కాలంలో పేషీ రాజకీయాలను ఎదుర్కొనడం తప్పదు. గత ప్రభుత్వంలో పలువురు మంత్రుల పేషీలు అవినీతిమయం అనే ఆరోపణలు వినిపించాయి. రాష్ట్రంలో కొత్త మంత్రి వర్గం ఏర్పాటుకు రంగం సిద్ధం కావడంతో మంత్రుల వద్ద వ్యక్తిగత కార్యదర్శి, వ్యక్తిగత సహాయకునిగా పనిచేయడానికి ఆసక్తి కనబరుస్తున్న వారి సంఖ్య పెరిగింది. గతంలో తమ అనుభవాలనూ, ఆదాయాలనూ పదిలపర్చుకొనేందుకో, పదింతలు చేసుకునేందుకో పాతవారు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
కొంత మంది పాత మంత్రులు కూడా తమ వ్యక్తిగత సిబ్బందిని మార్చుకోవాలని ఆలోచిస్తుండగా, ఓడిపోయిన మంత్రుల వద్ద పనిచేసిన వ్యక్తిగత సిబ్బందిలో కొందరు కొత్త మంత్రుల వద్ద స్థానం పదిలపర్చుకొనే విధంగా రాజకీయ పలుకుబడిని ఉపయోగించబోతున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వంలో మంత్రుల వద్ద పిఎస్, పిఎగా పని చేసిన వారు చాలా వరకు స్వంత శాఖలలో తిరిగి చేరిపోయారు. ఎన్నికల్లో గెలుపొందిన మంత్రుల వద్ద పని చేస్తున్న వారిలో అత్యధికులు తిరిగి తమకు పిఎస్, పిఎ పదవులు పదిలం అనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మంత్రుల వద్ద ప్రజా సంబంధాల అధికారులుగా పని చేసిన పలువురు ప్రభుత్వేతర సిబ్బంది కూడా తమ భవిష్యత్తుపై సమాలోచనలో పడ్డారు. పౌరసంబంధాల అధికారిగా పనిచేసిన వారిలో ఎక్కువ మంది తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేక పోయారనే అపవాదు వుంది. కొత్త మంత్రి వర్గంలో ప్రతి మంత్రి ఒక పౌరసంబంధాల అధికారిని నియమించుకొనడం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ హోదాకు అభ్యర్థిని ఎంపిక చేసుకొనడం మంత్రి ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉన్నందున నిర్దిష్టంగా మార్గదర్శకాలను సూచించలేకపోతున్నట్లు సమాచార శాఖ సీనియర్ అధికారులు తెలిపారు.
వ్యక్తిగత కార్యదర్శి, వ్యక్తిగత సహాయకుల నియామకాలు కూడా మంత్రి అభిప్రాయం ప్రకారం జరగాల్సి వున్నందున తామేమీ చేయలేమని సాధారణ పరిపాలన శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు పిఎస్, పిఏగా పనిచేసిన వారిలో అత్యధికులకు మంచిపేరులేదని, కొందరు మాత్రమే నిబద్ధతతో పనిచేసినట్లు రికార్డు వుందని వెల్లడించాయి. మంత్రులు కోరుకున్న పక్షంలో ఎలాంటివారైనా ఈ హోదాలో నియమించబడే అవకాశం వుందని వివరించారు. వివిధ శాఖలకు చెందిన పలువురు అధికారులు కొన్నేళ్ళుగా మంత్రుల వ్యక్తిగత సిబ్బంది హోదాలో కొనసాగుతూ మాతృ సంస్థనే మరిచిపోయే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని పేర్కొన్నారు. శాఖల వారిగా తగిన అనుభవం కలిగిన వారిని ఈ హోదాలలో నియమించడం వల్ల కొన్ని సానుకూల ఫలితాలు రాబట్టే అవకాశం ఉన్నప్పటికీ మంత్రుల వ్యక్తిగత సిబ్బందిపై అనేక రకాల ఆరోపణలు వెలుగుచూశాయని తెలిపారు.
Pages: -1- 2 News Posted: 25 May, 2009
|