ఒక్క కాల్ కోసం నిరీక్షణ
కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం కుదిరిన 'కోటా పద్ధతి' కింద మంగళవారం ప్రమాణ స్వీకారం చేయగలమని ఆశిస్తున్న మిత్రపక్షాలు కొన్నిటికి కూడా ఫోన్ కాల్ ఏదీ రాకపోవడం అనేది సమస్యగా ఉంది. అయితే, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నాలుగు గంటల సేపు చర్చలు జరిపినా ఏదీ ఖరారు కాకపోవడం ఆశావహులను మరింత ఆందోళనలోకి నెట్టింది. మంగళవారం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగకపోవచ్చునని, వారిద్దరరూ మరొకసారి సమావేశమైన తరువాతే నిర్ణయం జరగవవచ్చునని చెప్పారు.
ఇక డిఎంకె ఆశావహులు క్రమంగా ఢిల్లీ చేరుకుంటున్నారు. ఐటి మంత్రిత్వశాఖను చేపట్టుతున్నారా అని మీడియా అడిగినప్పుడు 'వారు ఆ విషయం బయటపెట్టారా? నాకేమీ ఫోన్ కాల్ రాలేదు' అని ఎ. రాజా సమాధానం ఇచ్చారు.
పూర్వపు ప్రభుత్వంలో సహాయ మంత్రిగా ఉన్న పృథ్వీరాజ్ చవాన్ ఈ సారి పదోన్నతి పొందవలసి ఉన్నది. ప్రధాని కార్యాలయం (పిఎంఒ) ఇన్ చార్జి అయినప్పటికీ ఆయన కూడా ఫోన్ కాల్ కోసం నిరీక్షిస్తున్నారు. ఈలోగా ఆయనకు ఇతర ఆశావహుల నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇక క్రితం వారం అంతా ఫోన్ కాల్ అందుకోని హెచ్.ఆర్. భరద్వాజ్ వంటివారు కొందరు ఉన్నారు. తాను ఇలాగే ఉంటే లాభం లేదనుకుని ఆయన అకస్మాత్తుగా రంగంలోకి దూకారు. ఆయన ముమ్మరంగా లాబీయింగ్ చేయడం కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం వ్యూహాన్ని మరింత సంక్లిష్టం చేసింది. ఆ సంగతి ఆయనకూ తెలుసు. అదే విషయం అడిగితే ఆయన నవ్వి ఊరుకున్నారు. అంటే తనకు అవకాశం ఉందని ఆయన ఆ విధంగా సూచించారన్న మాట.
ఇంతకుముందు ప్రభుత్వంలో సహాయ మంత్రిగా ఉన్న పవన్ కుమార్ బన్సల్ కూడా పదోన్నతిని, బహుశా స్వతంత్రంగా బాధ్యతలు నిర్వహించగల శాఖను ఆశిస్తున్నారు. కాని సోమవారం సాయంత్రానికల్లా ఆయన కూడా ఫోన్ కాల్ రాలేదేమిటా అని ఆశ్చర్యపోసాగారు. ఇతర ఎంపిలు కొందరు కూడా ఇదేవిధంగా ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారు. రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని బట్టి తమకు అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు. గత శుక్రవారం ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులు మంత్రులు కావడంతో వారి అంచనాలు గతి తప్పాయి.
ఈ వాతావరణం ఎలా ఉందంటే ఏ పరిణామం చోటు చేసుకున్నా ఏదో ఒక ఊహాగానానికి దారి తీస్తున్నది. పూర్వపు ప్రభుత్వంలో ఎస్. జైపాల్ రెడ్డి నిర్వహించిన పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖలో సోమవారం ఇదేవిధంగా ఊహాగానాలు చోటు చేసుకున్నాయి. అదే భవనంలో ఉన్న గృహనిర్మాణ, పేదరిక నిర్మూలన మంత్రిత్వశాఖలో సహాయ మంత్రిగా స్వతంత్రంగా బాధ్యతలు నిర్వహించి కుమారి సెల్జా సిబ్బంది కొందరు ఆఫీసును చూసేందుకు వచ్చినట్లుగా వార్తలు రావడం ఈ ఊహాగానాలకు తావిచ్చింది. జైపాల్ రెడ్డి పేరు పలు మంత్రిత్వశాఖల విషయంలో వినిపిస్తున్నది. ఇక ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఆయన సహచరులు ఫోన్ కాల్ కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. రాష్ట్రం నుంచి 33 మంది ఎంపిలు ఎన్నిక కావడంతో డిఎంకె ఒప్పందం నేపథ్యంలో తమకు కొన్ని శాఖలు లభించవచ్చునని ఆశిస్తున్నారు.
కాగా, ఆనంద్ శర్మ పదోన్నతితో హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఏకైక ఎంపి వీరభద్ర సింగ్ తన సంగతేమిటని ఆందోళన చెందుతున్నారు. మొదటిసారి ఎంపిగా ఎన్నికైన సి.పి. జోషిని మంత్రివర్గంలో చేర్చుకోవడంతో రాజస్థాన్ కు చెందిన ఇతర ఎంపిలు 20 మందిలో అసలు తమకు అవకాశం ఉంటుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ పోటీ ఎక్కువగా సహాయ మంత్రి పదవుల కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో జరుగుతోంది. ఇక ఉత్తర ప్రదేశ్ ఎంపిలు తమ రాష్ట్రంలో పార్టీ గణనీయంగా విజయాలు సాధించిన దృష్ట్యా తమకు కనీసం ఆరు సహాయ మంత్రి పదవులు లభించాలని అంటున్నారు. ఇప్పటి వరకు యుపి నుంచి ఏ మంత్రినీ చేర్చుకోలేదు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధి కూడా 'యువ ప్రతిభావంతుల' జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది. వారిని సహాయ మంత్రి పదవులకు పరిశీలించవచ్చు. అయితే, ఆ ఆశావహులను కూడా 'ఇంకా ఫోన్ కాల్ రాలేదే' అనే ప్రశ్న వేధిస్తున్నది. కొందరైతే 'మాకు ఏ సంగతీ చెప్పండి' అని అడుగుతున్నారు.
Pages: -1- 2 News Posted: 26 May, 2009
|