వైఎస్సార్ యూత్ కార్ ర్యాలీ
స్మిత్ విల్లే (టెన్నెస్సీ) : ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అఖండ విజయం సాధించడం అమెరికాలోని వైఎస్సార్ యువసేనకు మరింత ఉత్సాహం, ఆనందం కలిగించింది. తమ అభిమాన నాయకుడి విజయంలో పాలుపంచుకుంటూ అమెరికా వ్యాప్తంగా పలు నగరాల్లో విజయయాత్రలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మే 23, 24 తేదీల్లో టెన్నెస్సీ రాష్ట్రంలోని స్మిత్ విల్లే నగరంలో వైఎస్సార్ యువసేన అమెరికా విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్ ర్యాలీ, సమావేశాలు నిర్వహించారు. అమెరికా వ్యాప్తంగా వివిధ నగరాల నుంచి సుమారు ఐదు వందల మంది వైఎస్సార్ యువసేన నాయకులు, అభిమానులు హాజరైన ఈ ఉత్సవాలు హొటల్ ఈస్ట్ సైడ్ ఇన్ లో నిర్వహించారు. స్మిత్ విల్లే నగరం ఆ రెండు రోజులూ ర్యాలీకి, ఉత్సవాలకు హాజరైన అభిమానుల 'వైఎస్సార్ జయహో' నినాదాలతో మారుమోగిపోయింది. వైఎస్ ప్రభుత్వం గత ఐదేళ్ళలో అమలుచేసిన పలు సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి అవగాహన కల్పిస్తూ యువసేన ఒక చిత్రకళా ప్రదర్శనను ఏర్పాటు చేసింది.
ఈస్ట్ సైడ్ ఇన్ లో మే 24న జరిగిన సమావేశానికి పమ్మి సుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు. వైఎస్సార్, వైఎస్ జెఆర్ కమిటీల సభ్యులను వైఎస్సార్ యువసేన యుఎస్ ఎ కమిటీ అధ్యక్షుడు బొంతు నాగిరెడ్డి అభినందనలు తెలిపారు. వైఎస్సార్ విజయంలో పాలుపంచుకున్న యువసేన సభ్యుల సేవలను, ముఖ్యంగా 2008 ఆగస్టు 8న తమకు అప్పగించిన వైఎస్సార్ పోర్టల్ ద్వారా వైఎస్ విజయంలో యువసేన కీలకభూమిక పోషించిందని నాగిరెడ్డి అభినందించారు. ముఖ్యమంత్రి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి, ఆయన అల్లుడు రాజా నర్రెడ్డి ప్రత్యక్షంగా, పరోక్షంగా అందించిన సహకారం మరువలేనిదని అన్నారు.
Pages: 1 -2- News Posted: 26 May, 2009
|