పేర్లపై సింగ్, సోనియా రాజీ!
మిత్ర పక్షాల పట్ల అధిష్ఠానం 'ఉదార' వైఖరిని అనుసరిస్తుండడం పట్ల కూడా పార్టీలో ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. డిఎంకె, ఎన్ సిపిల విషయంలో రాజీకి రావడాన్ని వాటికి లొంగిపోవడంగా పలువురు భావిస్తున్నారు. మహారాష్ట్రలో ఎన్ సిపి గెలుచుకున్న సీట్ల సంఖ్య క్రితం సారి కన్నా ఒకటి తగ్గినప్పటికీ పూర్వపు ప్రభుత్వంలో వలె తన మంత్రుల సంఖ్యను తిరిగి పొందడానికి, తన మంత్రిత్వశాఖలను అట్టిపెట్టుకోవడానికి ఎన్ సిపిని అనుమతించిన తీరును మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆక్షేపిస్తున్నారు.
అనంతంగా సంప్రదింపులు సాగిస్తుండడం, పార్టీలో విధాన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం వల్ల 2009 ఎన్నికల ఫలితాలపై కలిగిన ఆనందం హరించుకుపోతున్నదని చాలా మంది అంటున్నారు. అఖండ విజయం పట్ల కలిగిన ఉత్సాహం క్రమంగా నిరసనకు, అసహనానికి దారి తీస్తున్నది. ఇప్పటికే మంత్రివర్గంలో చేరినవారిలో కొందరి గురించి అప్పుడే తీవ్ర స్థాయిలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. లోక్ సభ సీటును గెలుచుకుని కూడా తాను గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటుండగా రాజ్యసభ సభ్యుడైన ఆనంద్ శర్మను క్యాబినెట్ మంత్రిని చేయడాన్ని హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సహించలేకపోతున్నారు.
రాజ్యసభ సభ్యుడైన ఎస్.ఎం. కృష్ణను ఆశ్చర్యకరంగా మంత్రివర్గంలో చేర్చుకోవడం పట్ల కూడా కర్నాటకలో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కేంద్రంలో మంత్రిని చేయగలమనే వాగ్దానంతో మల్లికార్జున్ ఖర్గెను లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసి ఢిల్లీకి రావలసిందిగా కోరారు. ఆయన కృష్ణ నియామకం పట్ల అసంతుష్టి వ్యక్తం చేశారు.
రాజస్థాన్ లో కూడా పరిస్థితులు ఏమీ మెరుగ్గా లేవు. లోక్ సభకు ఎన్నికైన పలువురు సభ్యులు సిపి జోషిని క్యాబినెట్ మంత్రిని చేయడం సబబేనా అని బాహాటంగా ప్రశ్నిస్తున్నారు. జోషి నియామకం వారికి మరీ బాధ కలిగిస్తున్నది. ఎందుకంటే ఆయన లోక్ సభకు ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. పార్లమెంట్ ఎన్నికలలో గెలవడానికి ముందు ఆయన గత డిసెంబర్ లో శాసనసభ ఎన్నికలలో ఒక్క వోటు తేడాతో ఓడిపోయారు. 'దేనికైనా ఒక ప్రాతిపదిక ఉండాలి. మేము చాలా దశాబ్దాలుగా పార్టీకి సేవలు అందిస్తున్నాం. అయినప్పటికీ మమ్మల్ని అలక్ష్యం చేశారు' అని రాజస్థాన్ ఎంపి ఒకరు అన్నారు. ఎన్నికల అనంతరం నెలకొన్న అసమ్మతి వేడి చల్లారుతుందా లేక కొనసాగుతుందా అనేది గురువారం కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం తేలుస్తుంది.
Pages: -1- 2 News Posted: 27 May, 2009
|