తెరాసలో ఆరని చిచ్చు
కేసీఆర్ పార్టీ కార్యాలయాల వరకే తెలంగాణ అంశాన్ని తీసుకువెళ్ళగలిగారని, జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని చర్చకు పెట్టిన ఘనత కేసీఆర్ దే నంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ విమోచన వేదిక ఆవిర్భావ సదస్సుకు ప్రజా గాయకుడు గద్దర్ వంటి వారితో పాటు దేశిని చినమల్లయ్య, పాశం యాదగిరి వంటి వారిని కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. 2001లో తెరాస ఆవిర్భావం సందర్భంగా ఆ పార్టీకి మద్దతుగా నిలబడి తెలంగాణ ఉద్యమాన్ని ఒక కెరటంలా తీసుకువెళ్ళిన వారిని మళ్ళీ ఇప్పుడు ఉద్యమం వైపునకు రప్పించాలనే ప్రయత్నంలో వారున్నారు. అయినా వీరంతా ఉద్యమంలోనే కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో వీరందరి మద్దతు కూడగట్టేందుకు అసమ్మతి వాదులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఒక దశలో ఈ అసమ్మతివాదులకు తెరాస రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, ఎం.పీ.విజయశాంతితో పాటు పార్టీనుంచి గెలిచిన పది మంది శాసనసభ్యులు మద్దతు ఇస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో అసమ్మతి విషయం బయటపడిన రోజే కేసీఆర్ స్వయంగా విజయశాంతి ఇంటికి వెళ్ళి ఆమెతో సుదీర్ఘంగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమాన్ని బలహీనం చేసేందుకు మాత్రమే కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని, చివరకు వీరందిరతో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి తాము పార్టీలోనే ఉన్నామంటూ చెప్పించే ప్రయత్నం చేశారు. ప్రజారాజ్యం పార్టీలో కొనసాగుతున్న దేవేందర్ గౌడ్ ను తెరాసలోకి రప్పించేందుకు కెసిఆర్ ప్రయత్నాలు ప్రారంభించారు.
కేసీఆర్ ను అంత తొందరగా నమ్మలేమని గౌడ్ స్పష్టం చేసినట్లు సమాచారం. పార్టీలో గతంలో పనిచేసిన వారే కాకుండా బయట పార్టీలలో ఉన్న వారిని కూడా తెరాసలోకి రప్పించేందుకు కేసీఆర్ వ్యూహం పన్నుతున్నారు. ఇప్పటికే పార్టీ నుంచి వీడి బయటకు వెళ్ళిన వారు పార్టీలోకి రావాలంటూ, ఉద్యమాన్ని ఉధృతం చేద్దామంటూ హరీష్ రావు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన తెరాస యువజన విభాగం అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డిని ఎన్నికలకు ముందు పార్టీనుంచి కెసిఆర్ సస్పెండ్ చేశారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో జిట్టాపై విధించిన శిక్షను ఉపసంహరించుకుంటున్నామని కెసిఆర్ ప్రకటించారు. ఎన్నికల్లో భువనగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన జిట్టా బాలకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి స్వర్గీయ ఎలిమినేటి మాధవరెడ్డి సతీమణి ఉమా మాధవరెడ్డి చేతిలో స్వల్ప ఓట్లతోనే ఓడిపోయారు. ఈ నియోజకవర్గంలో జిట్టా రెండవ స్థానాన్ని పొందగా, అధికార కాంగ్రెస్ పార్టీ మూడవస్థానంలో నిలువడం విశేషం. జిట్టా కూడా అసమ్మతి వాదుల చేతుల్లోకి పోకుండా కెసిఆర్ వెంటనే స్పందించి ఆయనపై విధించిన సస్పెన్ష్ ను ఎత్తివేయడంతో జిట్టాను మళ్ళీ పార్టీలోకి రప్పించగలిగారు.
Pages: -1- 2 News Posted: 28 May, 2009
|