చిరు ఎదుట సవాల్
ప్రభుత్వంతో లోపాయకారీగా వ్యవహరిస్తూ, కావలసిన పనులు చేయించుకోవడం ద్వారా ఉనికి కాపాడుకోవలన్నది కొందరి వాదన. దానివల్ల పార్టీ ద్వారా ఎన్నికయిన ప్రజా ప్రతినిధులకే తప్ప, సంస్థాగతంగా పార్టీకొచ్చిన ప్రయోజనమేమీలేందటున్నారు. అయితే మరికొందరు మాత్రం కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో చేసిన ఖర్చును తిరిగి రాబట్టుకోవద్దా అని ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా నాయకులు ప్రభుత్వానికి లోపాయకారీగా మద్దతునిస్తే మంచిదని వాదిస్తున్నారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించినందు వల్ల ఎలాంటి ఫలితం ఉండదని, సన్నిహితంగా ఉంటేనే పనులవుతాయని కొందరు ప్రజారాజ్యం నాయకుల అభిప్రాయం. ప్రజారాజ్యం నుంచి ఎన్నికయిన వారిలో పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లే ఎక్కువగా ఉండటం గమనార్హం. కాగా, ప్రస్తుతం సభలో మజ్లిస్ పార్టీ పేరుకు ప్రతిపక్షమయినప్పటికీ, ప్రభుత్వానికి మద్దతుదారుగానే ఉంది. అనేక సందర్భాల్లో సభలో ఆ పార్టీ ప్రతిపక్షాలనే విమర్శించేది. అదే విధంగా గతంలో ప్రభుత్వాన్ని టీఆర్ ఎస్ విమర్శిస్తే దాని అసమ్మతి ఎమ్మెల్యేలు సమర్థించారు.
అయితే కొన్ని పార్టీల మాదిరిగా ప్రభుత్వంతో లోపాయకారీ ఒప్పందం కుదుర్చుకుని సభలో `అనుకూల శత్రువు'లా వ్యవహరిస్తే పార్టీకి భవితవ్యం ఉండదని సీనియర్ నేతలు హెచ్చరిస్తున్నారు. వారి వాదన ప్రకారం... దానివల్ల ప్రజారాజ్యం కాంగ్రెస్ తో కలిసిపోయిందన్న అపవాదు ఎదుర్కోక తప్పదు. ఆ ప్రచారాన్ని తోటి విపక్షాలు బలంగా ప్రచారం చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీ ఉనికి మాయమయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా లేకపోలేదు. అదే సమయంలో విపక్షాలతో కలిసి పోరాడితే, ప్రభుత్వం వేధిస్తుందన్న భయం మరొకవైపు పీడిస్తోంది. వైఎస్, ఆయన కోసం పనిచేసే బృందం ఎలాంటివారో తెలిసినందున సర్కారుకు వ్యతిరేకంగా గళం విప్పితే ఏమవుతుందో? చివరకు తమకు ఎంతమంది ఎమ్మెల్యేలు మిగులుతారో నన్న ఆందోళన కూడా లేకపోలేదు. ఇలాంటి విచిత్రమైన స్థితిలో ఉన్నప్రజారాజ్యం శాసనసభలో సమన్వయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక అయోమయంలో ఉంది.
అయితే, ప్రభుత్వంలో సానుకూలంగా వ్యవహరిస్తే పార్టీకి భవితవ్యం ఉండదని మరికొందరు సీనియర్లు వాదిస్తున్నారు. టిఆర్ఎస్ అసమ్మతి ఎమ్మెల్యేలు ఆవిధంగా వ్యవహరించినందుకే వారికి రాజకీయ భవితవ్యం లేకుండా పోయిందని గుర్తు చేస్తున్నారు. గతంలో పోరాటపార్టీలు కూడా ప్రభుత్వాల విషయంలో ఆ విధంగా వ్యవహరించినందువల్లే వారికి విశ్వసనీయం లేకుండా పోయిందంటున్నారు. తమ కోసం పార్టీ ఎమ్మెల్యేలు పోరాడుతున్నారన్న సంకేతాలు పంపినప్పుడే ఒక రాజకీయ పార్టీ విజయం, మనుగడ సాధించగలుగుతాంటున్నారు. సభలో సహచర ప్రతిపక్షాలతో కలసి, బయట విడిగా పోరాటాలు నిర్వహిస్తేతప్ప, ప్రజలు పార్టీని విశ్వసించరని స్పష్టం చేస్తున్నారు. చిరంజీవి సినిమాల్లో నటించడం మానేయడంతో పాటు, గత ఎన్నికల్లో దూరంగా పెట్టినందుకు అభిమానులు కూడా లేనందున,ఇకపై పూర్తి రాజకీయ నిర్మాణంతో వెళ్లడం అనివార్యమంటున్నారు. పార్టీకి సినీగ్లామర్ పనిచేయదన్న వాస్తవం రుజువు కావడంతో ఒక పార్టీగా జనం ముందుకు వెళ్లడమే శరణ్యమంటున్నారు.
Pages: -1- 2 News Posted: 29 May, 2009
|