ప్రతిపక్ష సమన్వయం హుళక్కే
న్యూఢిల్లీ : ప్రతిపక్షాల మధ్య ఐకమత్యం లేకపోవడం వల్ల డాక్టర్ మన్మోహన్ సింగ్ సారథ్యంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వం పార్లమెంట్ లో ధీమాగా వ్యవహరించగలదు. సార్వత్రిక ఎన్నికల అనంతరం పార్లమెంట్ సోమవారం మొదటిసారిగా సమావేశం అవుతున్నది.
లోక్ సభ తొలి మహిళా స్పీకర్ గా కేంద్ర మంత్రి మీరా కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఖాయంగా కనిపిస్తున్నది. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి పదవికి మీరా కుమార్ ఆదివారం రాత్రి రాజీనామా చేశారు.
కాగా, బిజెపి పార్లమెంటరీ పార్టీ నాయకునిగా ఎల్.కె. అద్వానీ ఆదివారం ఎన్నిక కావడం వల్ల దిగువ సభలో ప్రతిపక్షాలు సంఘటితంగా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాలు లేవని స్పష్టమవుతున్నది. ఏమైనా అద్వానీ బిజెపి పార్లమెంటరీ పార్టీకి సారథిగా ఉన్నా లేకపోయినా తెలుగు దేశం పార్టీ (టిడిపి), బిజూ జనతా దళ్ (బిజెడి), వామపక్షాలు వంటి పార్టీలు ఆ కాషాయ పార్టీతో సభలో సమన్వయంతో వ్యవహరించడం అనేది అసాధ్యం కాగలదు. అంటే ప్రతిపక్షంలో అన్ని వర్గాల సంఘటిత దాడి నుంచి ప్రభుత్వం తప్పించుకోగలదన్నమాట.
మరొక వైపు ప్రస్తుతం అధికార యుపిఎకు మద్దతు ఇస్తున్న సమాజ్ వాది పార్టీ (ఎస్ పి), బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్ పి), రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్ జెడి) వంటి పార్టీలు దీర్ఘకాలం దానితో కలసి సాగలేవు. హిందీ మాట్లాడే ప్రధాన రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్, బీహార్ లలో తమ తదుపరి ప్రధాన పోరు కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుందని వాటికి తెలుసు. అందువల్ల అవి త్వరలోనే వామపక్షాలతోను, భావసారూప్యత గల ఇతర పక్షాలతోను చేతులు కలపవలసి రావచ్చు. అదే కనుక జరిగితే, ఆర్థిక సంస్కరణలు వంటి కొన్ని అంశాలపై ప్రభుత్వానికి బిజెపి మద్దతు ఇచ్చే అవకాశం లేకపోలేదు.
ఇక డాక్టర్ మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా, జశ్వంత్ సింగ్, సుష్మా స్వరాజ్ వంటి బిజెపి నాయకులు, జనతా దళ్ (యు) నాయకుడు శరద్ యాదవ్ లకు తోడుగా ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి ప్రముఖులు సభలో ఉండడం వల్ల లోక్ సభలో కార్యక్రమాలు రసవత్తరంగా సాగవచ్చు.
Pages: 1 -2- News Posted: 1 June, 2009
|