విధేయులే `ప్రాంతీయ' చైర్మన్లు
హైదరాబాద్ : నిరుద్యోగ సీనియర్లలో అసంతృప్తిని పోగొట్టాడనికి దాదాపు సంవత్సరం క్రితం సృష్టించిన ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళను మళ్ళీ తెరమీదకు తీసుకువస్తున్నారు. 2004 ఎన్నికల తరువాత కొంత మంది సీనియర్లకు రాజశేఖర్ రెడ్డి మంత్రి పదవులు ఇవ్వలేదు. తమను వైఎస్ నిర్లక్ష్యం చేస్తున్నారని గళమెత్తిన వీరిని బుజ్జగించడానికి మండలి చైర్మన్ పదవులను కట్టబెట్టారు. నిధులు, అధికారాలు లేని పదవులు ఎందుకని వారిలో కొంతమంది బహిరంగంగానే ధ్వజమెత్తారు. పదవులు ఇచ్చినా అవి ఉనికిలో ఉన్నాయో లేదో అన్నట్టుగానే కాలం గడిచిపోయింది. ఈసారి కూడా కొంతమంది సీనియర్లకు వైఎస్ మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. అలాంటి వారికి బల్బు (బుగ్గ)కారు హోదాలో ఈ పదవులను ఇవ్వాలని వైఎస్ నిర్ణయించారు. గతంలో మాదిరిగా పదవుల భర్తీ కార్యక్రమంలో జాప్యం లేకుండా వెంటనే నియామాకాలు జరపాలని ఆయన నిర్ణయించారు. జూన్ 16 కల్లా పదవుల భర్తీని పూర్తి చేయాలన్న అభిప్రాయంతో ముఖ్యంమంత్రి ఉన్నారు.
రాష్ట్రాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేశారు. వాటికి చైర్మన్లను కూడా నియమించారు. అయితే నలుగురిలో ఒక్కరు మాత్రమే చైర్మన్ పదవిని స్వీకరించారు. తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి బోర్డుకు ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి, రాయలసీమ ప్రాంతీయ అభివృద్ధి బోర్డుకు గాలి ముద్దుకృష్ణమనాయుడు, కోస్తా ప్రాంతీయ అభివృద్ధి బోర్డుకు గాదె వెంకటరెడ్డి, ఉత్తరాంధ్ర ప్రాంతీయ అభివృద్ధి బోర్డుకు పి.సాంబశివరాజును చైర్మన్లుగా నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అయితే ఒక్క పురుషోత్తంరెడ్డి తప్ప మిగిలిన ముగ్గురూ చైర్మన్ పదవీ కాలం ఈనెల 22తో ముగిసింది. సికె బాబు ఎమ్మెల్యేగా ఎన్నికావడంతో రాయలసీమ అభివృద్ధి బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం నాలుగు చైర్మన్ పదవులు ఖాళీగా ఉన్నాయి.
రాయలసీమ ప్రాంతీయ అభివృద్ధి బోర్డు చైర్మన్ పదవికి ఎన్ తులసిరెడ్డి, కె ప్రభావతమ్మ, నరేష్ కుమార్ రెడ్డి, వెంకటరమణ, పాటిల్ వేణుగోపాల్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. కడప జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పుట్టా నరసింహారెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎన్నికలప్పుడు టిడిపిలో చేరారు. ఈ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలో తులసిరెడ్డిని నిలబెట్టాలని దాదాపు నిర్ణయించారు. అలాగే అనంతపురం జిల్లాలో స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన టిడిపికి చెందిన పల్లె రఘునాధరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికకావడంతో ఎమ్మెల్సీ పదవి ఖాళీ అయింది. ఈ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో పాటిల్ వేణుగోపాల్రెడ్డిని నిలబెట్టాలని నిర్ణయించారు.అందువల్ల రాయలసీమ ప్రాంతీ అభివృద్ధి బోర్డు చైర్మన్ పదవికి పరిశీలనలో ఉన్న తులసిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి పేర్లను తొలగించే అవకాశాలున్నాయి. ఇక కడప జిల్లా రాజంపేట అసెంబ్లీ టిక్కెట్టును సిటింగ్ ఎమ్మెల్యే అయిన ప్రభావతమ్మకు కాకుండా మరొకరికి ఇచ్చారు. అలాగే తిరుపతి అసెంబ్లీ టిక్కెట్టును సిటింగ్ ఎమ్మెల్యే అయిన వెంకటరమణకు కాకుండా బి కరుణాకర్ రెడ్డికి ఇచ్చారు. అందువల్ల త్యాగధనుల జాబితాలో వెంకటరమణ, ప్రభావతమ్మ ఉన్నారు. మదనపల్లి టిక్కెట్టును గత రెండు ఎన్నికల్లో ఆశించి భంగపడ్డ మాజీ మున్సిపల్ చైర్మన్ నరేష్ కుమార్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది.
Pages: 1 -2- News Posted: 1 June, 2009
|