విధేయులే `ప్రాంతీయ' చైర్మన్లు
తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి బోర్డు చైర్మన్ పదవికి మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి పేరు దాదాపు ఖాయంగా చెబుతున్నారు. జీవన్ రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నాయకత్వం చెప్పినట్లు చేయడం, పార్టీ పట్ల అంకిత భావంతో పని చేయడం ఆయనకు కలసి వచ్చే అంశాలు. ఎమ్మెల్యేగా ఉంటూ కరీనంగర్ లోక్ సభ స్థానానికి రెండు సార్లు జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పోటీ చేయగా, రెండోసారి మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి పోటీ చేశారు. అందువల్ల జీవన్ రెడ్డి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ కు సదభిప్రాయం ఉంది.
కోస్తా ప్రాంతీయ అభివృద్ధి బోర్డు చైర్మన్ పదవికి మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు పిన్నమనేని కోటేశ్వరరావు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. అయితే పిన్నమనేనికి వయసురీత్యా అవకాశం ఉండకపోచ్చని మండలి బుద్ధ ప్రసాద్ కే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే అధికార భాషా సంఘం చైర్మన్ పదవికి కూడా మండలి బుద్ద ప్రసాద్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. తెలుగుభాష పట్ల సాహిత్యం పట్ల మండలికి ఎక్కువ మక్కువ కారణంగా అధికార భాషా సంఘం చైర్మన్ పదవికి కూడా ఆయన పేరును ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
ఉత్తరాంధ్ర ప్రాంతీయ అభివృద్ధి బోర్డు చైర్మన్ పదవికి మాజీ పార్లమెంటు సభ్యుడు కణితి విశ్వనాథం పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకోవడం, ఉత్తరాంధ్రలో ప్రబావం చూపే కాళింగ వర్గానికి చెందిన కణితి విశ్వనాధానికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విశ్వనాధం ముఖ్యమంత్రి వైఎస్ సన్నిహితుల్లో ఒకరు కావడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే ఎంవి కృష్ణారావు పేరు కూడా పరిశీలనలో ఉంది. అయితే మంత్రి బొత్స సత్యనారాయణ (సత్తిబాబు) ఆశీస్సులు ఉన్నవారినే ఈ పదవి వరించే అవకాశం కనిపిస్తోంది.
Pages: -1- 2 News Posted: 1 June, 2009
|