ఇంజనీర్లకు లాబ్ శిక్షణ
న్యూఢిల్లీ : దేశంలో సాంప్రదాయక ఇంజనీరింగ్ విద్య పట్ల అసంతృప్తితో ఉన్న వైజ్ఞానిక, పారిశ్రామిక పరిశోధనా మండలి (సిఎస్ఐఆర్) ఈ సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ తో నియత విద్యా రంగంలోకి ప్రవేశస్తున్నది. ఎనిమిది సిఎస్ఐఆర్ లేబరేటరీలు ఇంజనీరింగ్ అభ్యర్థుల కోసం విద్య, పరిశోధన కార్యక్రమాన్ని ప్రవేశపెడుతుంది. వారికి కోర్సు చేస్తుండగా వేతనాల చెల్లింపు జరుగుతుంది. రెండు సంవత్సరాల అనంతరం వారి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాను అందజేస్తారు.
వర్కింగ్ సైంటిస్టులు, లైవ్ ప్రాజెక్టుల నుంచి అనుభవపూర్వక శిక్షణ పొందే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్లతో కొత్త కేడర్ ను సృష్టించడం ఈ పథకం లక్ష్యమని సిఎస్ఐఆర్ అధికారులు తెలియజేశారు. ప్రభుత్వ నిధులతో సిఎస్ఐఆర్ ఆధ్వర్యంలో 38 లేబరేటరీలు నడుస్తున్నాయి. ఆశావహమైన పరిశోధనా లక్ష్యాల సాధనకు తగినంత నైపుణ్యం ఉన్న ఇంజనీర్ల విషయంలో దేశంలో తీవ్రమైన కొరత ఉన్నది. ఈ కొరతను తీర్చడం కూడా ఈ పథకం లక్ష్యం. ప్రస్తుత పిజి ఇంజనీరింగ్ శిక్షణ ప్రమాణాల పట్ల సిఎస్ఐఆర్ అసంతృప్తిని ఇది ప్రతిబింబిస్తున్నది.
'భారీ, ఆశయాకాంక్షలతో కూడిన పరిశోధనా లక్ష్యాలను ప్లాన్ చేసి అమలు జరిపేందుకు మాకు ఇంజనీరింగ్ లో డాక్టరేట్లు (పిహెచి డి హోల్డర్లు) అవసరం. కాని మాకు వారు తగినంత మంది లభ్యం కావడం లేదు' అని సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ సమీర్ బ్రహ్మచారి తెలియజేశారు.
ప్రస్తుతం పిహెచ్ డిలు ఉన్న దాదాపు 280 మంది ఇంజనీర్లు వివిధ సిఎస్ఐఆర్ లేబరేటరీలలో పరిశోధన చేస్తున్నారు. వారిలో సుమారు 20 మంది నుంచి 25 మంది వరకు ప్రతి సంవత్సరం రిటైరవుతుంటారు. కాని వారి స్థానంలో కొత్త వారు రావడం లేదు.
ఇంజనీరింగ్ పిహెచ్ డి హోల్డర్ల కొర దేశవ్యాప్తంగా పీడిస్తున్న సమస్య. ఐఐటిలతో సహా దేశంలోని విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ ఇన్ స్టిట్యూట్ లు ఏటా ఇంజనీరింగ్ లో దాదాపు 1000 మంది పిహెచ్ డిలను మాత్రమే తయారు చేస్తున్నాయి. టెక్నాలజీ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడానికి, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో ఫ్యాకల్టీగా పని చేయడానికి ఆ సంఖ్యకు కనీసం ఆరు రెట్లు నుంచి పది రెట్లు వరకు ఇంజనీరింగ్ పిహెచ్ డిలు మన దేశానికి అవసరమని టెక్నాలజీ విశ్లేషకుల అంచనా.
Pages: 1 -2- News Posted: 1 June, 2009
|