విశిష్టమైనది ఈ లోక్ సభ
చర్చలు సుదీర్ఘంగా సాగుతుంటే మధ్యలో కల్పించుకుని 'ఖామోష్' అంటూ హుంకరించేందుకు శత్రుఘ్న సిన్హా కూడా సభలో ఉన్నారు. కాని, ఆయన పార్టీ సహచరుడు వరుణ్ గాంధి పరిధి దాటబోయినట్లయితే, ఆయన అలా అనలేకపోవచ్చు. అయితే, నో బాల్స్ ప్రకటించేందుకు సోమనాథ్ చటర్జీ లేని లోటు ఈ సభలో కనిపించవచ్చు.
'హెడ్మాస్టర్' లేకపోవచ్చు. కాని అర్థవంతంగా చర్చలను సాగించేందుకు ప్రభుత్వ పక్షంలో కాలేజీ ప్రొఫెసర్ ఒకరు ఉన్నారు. ఆయన తృణమూల్ కాంగ్రెస్ ఎంపి సౌగతా రాయ్. రాహుల్ గాంధి అనుయాయి మీనాక్షీ నటరాజన్ మాట్లాడుతున్నప్పుడు సభ్యులు చెవులు రిక్కించి వినవచ్చు.
కాకపోతే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్ పిఐ)కి చెందిన రామదాస్ అతావాలె జోకులు, పాటలు, ప్రాసలు ఈ సారి సభలో వినపడవు. కాని స్వతంత్ర సభ్యుడు ఇందర్ సింగ్ నాంధారి తన రంగస్థల ప్రావీణ్యంతో ఆ లోటును కొంత వరకు భర్తీ చేయవచ్చు. ఇక లాలూ ప్రసాద్ యాదవ్, రఘువంశ్ ప్రసాద్ సింగ్ వంటి వెటరన్లు తాము మంత్రులుగా లేకపోయినా హాస్యాన్ని వెలువరించేందుకు వెనుకాడక పోవచ్చు. ఆధ్యాత్మిక కోణం ఇవ్వడానికి కాంగ్రెస్ పక్షంలో గురు సత్పాల్ మహరాజ్ ఉన్నారు. వివాదాస్పదుడైన మత మార్పిడుల వ్యతిరేక ప్రచారకుడు దిలీప్ సింగ్ జుదేవ్ బిజెపిలో ఉన్నారు.
ఇక మనవలు, మనవరాళ్ళు ఆసక్తి రేకెత్తించవచ్చు. చరణ్ సింగ్ మనవడు జయంత్ చౌదరి ఇప్పటికే తన మేధతో పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లో అందరి దృష్టినీ ఆకర్షించారు. హర్యానా వెటరన్ బన్సీలాల్ మనవరాలు శ్రుతి చౌదరి కూడా కెమెరాలను తన వైపు తిప్పించుకోవడం తథ్యం. కాంగ్రెస్ ప్రముఖుడు నాథూరామ్ మీర్ధా మనవరాలు, డాక్టర్ జ్యోతి మీర్ధాకు పార్లమెంటు సభ్యురాలిగా రాణించే సత్తా ఉందని అంటున్నారు. న్యాయవాది, ఘనీఖాన్ చౌధురి మేనకోడలు మౌసమ్ నూర్ పైన, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ కోడలు హర్ సిమ్రాత్ కౌర్ పైన కూడా అందరి దృష్టి కేంద్రీకృతం కావచ్చు.
పుత్రోదయాలు కూడా లేకపోలేదు. కర్నాటక ముఖ్యమంత్రి బి.ఎస్. యెడ్యూరప్ప కుమారుడు కె. రాఘవేంద్ర, హెచ్.డి. దేవేగౌడ కుమారుడు హెచ్.డి. కుమారస్వామి లోక్ సభలో తొలిసారిగా అడుగుపెడుతున్నారు. అయితే, వెటరన్లకు సూర్యాస్తమయం లేదు. మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, వీరభద్ర సింగ్, వీరప్ప మొయిలీ ట్రెజరీ బెంచీలకు వన్నె తేగలరు. వారికి పోటీగా ప్రతిపక్ష బెంచీలలో శరద్ యాదవ్ కూడా లేకపోలేదు.
Pages: -1- 2 News Posted: 1 June, 2009
|