లెక్కల్లో బాలికలూ ఘనులే
న్యూఢిల్లీ : లెక్కల్లో బాగా రాణించకుండా బాలికలకు అడ్డుపడుతున్నది తెలివితేటలు కాకుండా సాంఘిక, సాంస్కృతిక అంశాలేనని ఒక అధ్యయనంలో తేలింది. లెక్కల్లో బాలబాలికల మధ్య అంతరానికి కారణాన్ని అన్వేషించడానికి అత్యంత విస్తారంగా నిర్వహించిన అధ్యయనం ఇది. యుఎస్ మాడిసన్ లోని యూనివర్శిటీ ఆఫ్ విస్కాన్సిన్ లో శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ అధ్యయనం అంతర్జాతీయ లెక్కల ఒలింపియాడ్ (ఐఎంఒ)లో భారతీయ జట్లలో బాలికలు లేకపోవడాన్ని, ఒక వేళ ఉన్నా అత్యల్ప సంఖ్యలో ఉండడాన్ని కూడా వివరించవచ్చు.
లెక్కల విషయంలో బాలురు లేదా పురుషుల కన్నా బాలికలు లేదా మహిళలలో సామర్థ్యం తక్కువగా ఉంటుందని దశాబ్దాలుగా సాగుతున్న అభిప్రాయాన్ని ఈ అధ్యయనం తోసిపుచ్చుతున్నట్లున్నది. ఇంతకుముందు 1990 దశకంలో నిర్వహించిన అధ్యయనాలు ఈ సిద్ధాంతాన్ని సవాల్ చేశాయి. అయితే, పూర్వపు పరిశోధనల కన్నా మరింతగా డేటాను, దాఖలాలను ఈ కొత్త అధ్యయనంలో ఉపయోగించారు. దీని ఫలితాలు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తాజా సంచికలో ప్రచురితం కానున్నాయి.
'ఐఎంఒ జట్లలో అమోఘమైన ప్రతిభ గల బాలికల శాతానికి, బాలబాలికల మధ్య సమానత్వానికి మధ్య గల సంబంధాన్ని ఈ అధ్యయనం తొలిసారిగా సూచిస్తున్నది' అని సైకాలజీ ప్రొఫెసర్, పరిశోధక బృందం సభ్యురాలు జానెట్ హైడ్ 'ది టెలిగ్రాఫ్' పత్రిక విలేఖరితో చెప్పారు.
గడచిన పది సంవత్సరాలలో ఐఎంఒలో ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన 60 మంది విద్యార్థులలో నలుగురు మాత్రమే బాలికలు. ఫ్రాన్స్, జపాన్, చివరకు అమెరికా నుంచి కూడా ఐఎంఒ జట్లలో బాలికల సంఖ్య ఇంత తక్కువ దామాషాలోనే ఉన్నది. కాని కెనడా, యుక్రెయిన్, యుకె, సెర్బియా దేశాల బృందాలలో బాలికల సంఖ్య కొంత ఎక్కువగానే ఉన్నది. పునరేకీకరణకు ముందు 13 సంవత్సరాలలో తూర్పు జర్మనీ జట్లలో ఐదుగురు బాలికలు ఉండగా పశ్చిమ జర్మనీ జట్లలో ఒక్క బాలిక కూడా లేదు. యుఎస్ లో బాలికలు ఇప్పుడు బాలుర స్థాయిలోనే హైస్కూల్ లో క్యాలుక్యులస్ తీసుకుంటున్నారు. ఆ దేశంలో మహిళలకు గణితశాస్త్రంలో ప్రదానం చేస్తున్న డాక్టరేట్ల శాతం 1950 దశకంలోని 5 నుంచి 21వ శతాబ్దం ప్రారంభంలో 30కి పెరిగింది.
Pages: 1 -2- News Posted: 2 June, 2009
|