ఇది 'నమ్మకాల' సర్కార్
హైదరాబాద్ : శుభ ముహూర్తాల విశ్వాసపరులు రాష్ట్ర సచివాలయ సిబ్బందిని చిక్కుల్లోకి నెట్టారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి బుధవారం ఉదయం 6.30 గంటల ముహూర్తానికి తన కార్యాలయంలోకి ప్రవేశించగా మరి ఎనిమిది మంది మంత్రులు తమకు మంచివిగా భావించిన సమయాలలో తమ బాధ్యతలు స్వీకరించారు.
వైఎస్ఆర్ ఉదయం 6.30 గంటలకు బాధ్యతలు స్వీకరించాలని నిశ్చయించుకోవడంతో జిఎడి ఉద్యోగులతో సహా సచివాలయం సిబ్బంది తెల్లవారు జామున 5 గంటలకే అక్కడికి చేరుకోవలసి వచ్చింది. అయితే, ఒక మంత్రి శుభముహూర్తం విషయంలో ముఖ్యమంత్రి కన్నా ఒక అడుగు ముందే వేశారు. పి. రామచంద్రారెడ్డి 5.30 గంటలకు అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అందువల్ల సచివాలయం సిబ్బంది మంగళవారం రాత్రి నుంచే పని చేయవలసి వచ్చింది.
ఇక ప్రప్రథమంగా సి బ్లాక్ లో ముఖ్యమంత్రి కోసం ఎర్ర తివాచి పరచి స్వాగతం పలికారు. డాక్టర్ రాజశేఖరరెడ్డి మే 20న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, ఐదు రోజుల తరువాత సి బ్లాక్ లోనే కాన్ఫరెన్స్ హాల్ లో మంత్రివర్గ తొలి సమావేశాన్ని నిర్వహించినప్పటికీ 2004, 2009 మధ్య ఐదు సంవత్సరాల పాటు తాను పాలన సాగించిన చాంబర్స్ లోకి అడుగుపెట్టలేదు. అందుకు కారణాలు ఆయనకే తెలియాలి. మంగళవారం వరకు వైఎస్ఆర్ తన క్యాంప్ ఆఫీస్ నుంచే కార్యకలాపాలు సాగించారు.
బుధవారం బాధ్యతలు స్వీకరించిన ఇతర మంత్రులలో వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి పి. విశ్వరూప్, ఆరోగ్యశ్రీ శాఖ మంత్రి పి. సత్యనారాయణ, సహకార, కార్మిక శాఖ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఉన్నత విద్యా శాఖ మంత్రి డి. శ్రీధరబాబు, వైద్య విద్యా శాఖ మంత్రి పి. సుదర్శన్ రెడ్డి ఉన్నారు. రఘువీరారెడ్డి 7.50 గంటలకు, విశ్వరూప్, సత్యనారాయణ, వెంకటరెడ్డి 8 గంటలకు, శ్రీధరబాబు, సుదర్శన్ రెడ్డి 9 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. కాగా, మైనర్ ఇరిగేషన్ శాఖ మంత్రి వి. సునీతా లక్ష్మారెడ్డి ఒక్కరే సాయంత్రం 4.41 గంటలకు కొత్త బాధ్యతలు స్వీకరించారు.
తెల్లవారు జామున ఈ ప్రక్రియ సాగడం పట్ల సచివాలయం సిబ్బంది దిగ్భ్రాంతి చెందినట్లు తెలుస్తున్నది. సచివాలయంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. 'ఇది వారికి శుభసమయం కావచ్చు. కాని సిబ్బందికి మాత్రం తమ తప్పు లేకుండానే శిక్షకు గురి కావడం వంటిదే' అని జిఎడిలో సీనియర్ ఉద్యోగి ఒకరు వ్యాఖ్యానించారు.
Pages: 1 -2- News Posted: 3 June, 2009
|