ఇది 'నమ్మకాల' సర్కార్
పాత మంత్రులు శుభముహూర్తాల కోసం చూస్తే కొత్త మంత్రులు వాస్తు నిపుణులను కూడా సంప్రదిస్తున్నారు. ఆఫీసులోకి ఏవిధంగా అడుగు పెట్టాలి, ఏ దిశలో మంత్రి కూర్చోవాలి వంటి సలహాలను వాస్తు నిపుణులను అడుగుతున్నారు. తల పండిన రాజకీయ నాయకుడు, ఆర్థిక మంత్రి కొణిజేటి రోశయ్య తన ఆఫీసులోకి తొలిసారిగా అడుగుపెట్టే ముందు తలుపు వద్ద ఒక కొబ్బరికాయ కొట్టారు. 'భగవంతుడు నాపై కరుణ చూపుతున్నాడు. నేను రాష్ట్ర ప్రజల కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తాను' అని రోశయ్య అన్నారు.
అనేక సార్లు కొద్దిలో అవకాశాలను కోల్పోయిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దానం నాగేందర్ ఎట్టకేలకు మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. ఈ అవకాశం వదలుకోరాదనుకుని ఆయన ఒక వాస్తు ప్రవీణుని సంప్రదించారు. వేద మంత్రోచ్చాటనల మధ్య ఆయన సచివాలయంలో డి బ్లాక్ లోని తన కొత్త కార్యాలయంలోకి ప్రవేశించారు. 'చాలా మంది వలె నేను వాస్తు నిపుణుని సంప్రదించాను. ఇది ఒక సెంటిమెంట్. ప్రతి ఒక్కరూ సంప్రదాయాన్ని పాటిస్తూ కృతకృత్యులు కావాలని అనుకుంటారు. ఒక నిపుణుని సంప్రదించడంలో తప్పేమీ లేదు' అని నాగేందర్ వ్యాఖ్యానించారు.
తమ వాస్తు నిపుణుల సలహా మేరకు పలువురు మంత్రులు తమ ఆఫీసులకు ఉత్తరం వైపు లేదా తూర్పు వైపు ఎంట్రన్స్ ఉండేట్లు చూసుకున్నారు.తదనుగుణంగా రోశయ్య, నాగేందర్ ఆఫీసులకు ఉత్తరం వైపు ఎంట్రన్స్ లు ఉన్నాయి. హోమ్ శాఖను తొలిసారిగా నిర్వహిస్తున్న తొలి మహిళగా ఘనత పొందిన సబితా ఇంద్రారెడ్డి కూడా తన ఆఫీస్ ఎంట్రన్స్ తూర్పు దిశగా ఉండేట్లు చూసుకున్నారు.
కొత్తగా చేరిన మంత్రి ఒకరు ఈ విషయం గురించి మాట్లాడుతూ, 'మేము మంచి శాఖల కోసం రాత్రంతా ప్రార్థించాం. ఆశలు పెరుగుతుంటాయి. ముందు మేము గెలవాలని కోరుకుంటాం. తరువాత మంత్రి పదవి కోసం ప్రార్థిస్తాం. ఆతరువాత మంచి శాఖ కావాలనుకుంటాం. అదంతా అయిన తరువాత పదవీకాలం సాఫీగా సాగిపోవాలని ప్రార్థిస్తాం. కోర్కెలకు అంతే ఉండదు' అని పేర్కొన్నారు. 'చివరకు ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఆయన రెండవ దఫా అధికారం దక్కాలని భగవంతుని ప్రార్థించారు. ఇది మన సంస్కృతిలో భాగం' అని ఆయన అన్నారు.
Pages: -1- 2 News Posted: 3 June, 2009
|