చిరు ఛరిష్మా ఉండేనా?
హైదరాబాద్ : అధికార పీఠాన్ని సాధించడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి ప్రజారాజ్యం పార్టీతో వచ్చిన చిరంజీవి ఎన్నికల తరువాత ఏమి సాంధించారన్నది ఇప్పుడు ఆయన అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. ఊహించని రీతిలో పార్టీ పరాజయం పాలవడం ఒక ఎత్తైతే, స్వయంగా చిరంజీవి పాలకొల్లులో ఓడిపోవడం ముమ్మాటికీ పరాభవమేననీ వారి ఆవేదన. ఈ స్థితిలో పదిహేడుమంది సహచరులతో శాసనసభలో కూర్చుని ఆయన ఎలా ప్రజలను ఆకర్షిస్తారన్నది అర్థం కాని అంశంగానే కనిపిస్తోందని వారి వాదన. ఎన్నికల్లో ఓటమికి బాధ్యులని కొంతమంది పేర్లు బయటకు వచ్చినా, పార్టీలో వ్యవహారాల తీరుపైన, ఎన్నికల్లో పరాజయంతోనూ స్వయంగా సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్ దూరమై పోయినా ప్రజారాజ్యం మనుగడ సాధ్యమేనని చెబుతున్న చిరంజీవి వైఖరిపై కూడా అభిమానులు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారని పేరున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికీ టిక్కెట్ల అమ్మకంపై నోరెత్తకపోవడం అనుమానించవలసిన విషయమేనని అభిమానులంటున్నారు.
అయితే ఎన్ని సమీక్షలు నిర్వహించినా, ఎన్ని సమావేశాలు ఏర్పాటు చేసినా, ఎంత మంది సూచనలు తీసుకున్నా ప్రజారాజ్యం అధినేత చిరంజీవి సాధించింది, సాధించేది ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది. ఎన్నో సమావేశాలు నిర్వహించి ఈ ప్రశ్నకు జవాబు రాబట్టాలని చిరంజీవి ప్రయత్నించినా ఫలితం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమీక్షలన్నీ కార్యకర్తలు, అభిమానుల మనోభావాలకు నష్టం కలిగించే విధంగానే సాగాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే అసలు ఈ సమీక్షల్లో వచ్చిన ఆలోచనల ప్రకారం చిరంజీవి నిర్ణయాలు తీసుకుంటారా, అసెంబ్లీలోనూ అదే విధంగా వ్యవహరిస్తారా అనేది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది.
Pages: 1 -2- News Posted: 3 June, 2009
|