చిరు ఛరిష్మా ఉండేనా?
ఇదిలా ఉండగా అసలు ఇప్పటి వరకూ నిర్వహించిన సమీక్షా సమావేశాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నామని అధినేత చెబుతున్నా నిర్ణయాలు కీలకంగా కనిపించడం లేదు. సమీక్షలో మెజార్టీ స్థాయిలో పిఎసి సభ్యులు చెప్పిన విషయాలు చిరు పెడచెవినపెట్టారని, సీనియర్ నాయకులు చేసిన సూచనల ప్రకారం ఆయన నడుచుకున్నారా అంటే అదీ లేకుండా పోయిందనీ ఆయన శ్రేయోభిలాషులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇప్పటి వరకూ నిర్వహించిన సమీక్షల్లో అల్లు అరవింద్ వల్లే పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని కొందరు సీనియర్లు చెప్పినప్పటికీ ఆయన ఆ విషయాన్ని ఈ సమీక్షల్లో కొట్టిపారేశారు. దీంతో చిరుకు తెలిసే ఇప్పటి వరకూ అన్నీ జరిగాయని ఆయా నాయకులు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
అనేక ప్రసంగాలు చేసి గతంలో ప్రజల అభిమానాన్ని పొందిన చిరు అదేవిధమైన అభిమానాన్ని అసెంబ్లీ సమావేశాల ద్వారానూ పొందాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధమైన అభిమానాన్ని దగ్గర చేసుకోవాలంటే ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వంపై అస్త్రాలు సంధించాలి. కానీ అసెంబ్లీలో ప్రజా సమస్యల పట్ల స్పందించే తీరులోనూ అల్లు మాటల ప్రకారమే చిరంజీవి నడుస్తారని, అదే జరిగితే మరో మారు ప్రజారాజ్యం ప్రజల్లో పలచన కావడం ఖాయమని ఆయనను సన్నిహితంగా గమనిస్తున్నవారే చెబుతున్నారు. ఓవైపు అభిమానులను దూరం చెయ్యబట్టే ఎన్నికల్లో తీవ్ర ఓటమని చవి చూశామని గతంలో అభిమాన సంఘాల నేతలు, కిందిస్థాయి నాయకులు చిరుకు తేల్చి చెప్పారు. కానీ చిరు ఈ విషయంపై దృష్టి సారించిన దాఖలాలు నేటికీ కానరావడం లేదు. అదే విధంగా కార్యకర్తలను సైతం లెక్క చేయకుండా ఎవరిఇష్టమొచ్చిన నిర్ణయాలు వారు తీసుకుంటున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. వీటిని చిరంజీవి పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
ప్రతి ఒక్క నాయకుడూ చిరు చరిష్మాతో విజయం సాధిస్తారని ప్రసంగాలు ఊదరగొట్టినా అసలు చిరంజీవికి ఈ స్థాయిలో చరిష్మా ఇచ్చింది అభిమానులేనని వారే చిరంజీవిని సినీ పరిశ్రమ నుంచి అసెంబ్లీ హాలు వరకూ నేడు నడిపించారని వారి వాదన. మరి ఇంతటి చరిష్మా తీసుకొచ్చిన తమకు ప్రజారాజ్యంలో మిగిలిందేమిటని అభిమానులు వేస్తున్న ప్రశ్నకు ఇప్పటికీ సరైన సమాధానం రాలేదు. ఇప్పటికైనా ఈలోటును చిరు గుర్తించి గ్రామస్ధాయి అభిమానులతో, కింది స్థాయి నాయకులతో, ముఖ్య కార్యకర్తలతో, రెబెల్ నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తే పార్టీలోని అసలైన లోటుపాట్లు తెలుస్తాయనీ, ఆ మేరకు చిరంజీవి కృషి చేసి కింది స్థాయి వారిలో ఉత్సాహాన్ని నింపితే పార్టీకి భవిష్యత్ ఉంటుందనేది మెజార్టీ అభిమానులు, కార్యకర్తల అభిప్రాయం.
Pages: -1- 2 News Posted: 3 June, 2009
|