దాడులపై టిసిఎ ఖండన
న్యూయార్క్ : ఆస్ట్రేలియాలో ఇటీవల భారతీయ విద్యార్థులపై జాతి వివక్ష దాడులు పెరిగిపోవడాన్ని అమెరికాలోని తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (టిసిఎ) తీవ్రంగా ఖండించింది. ఆస్ట్రేలియాలో ప్రవాస భారతీయులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆ సంస్థ అధ్యక్షుడు విజయ్ చవ్వ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రవాస భారతీయ విద్యార్థులపై ప్రధానంగా మెల్బోర్న్ లో జరుగుతున్న దాడులు ముఖ్యంగా 'మెత్తని వ్యక్తుల'నే అదీ భారతీయ విద్యార్థులనే లక్ష్యంగా చేసుకొని జరుగుతున్నాయని ఇటీవల పలువురు ఆస్ట్రేలియా విద్యార్థులు, ప్రవాస భారతీయులతో తాము చర్చించినప్పుడు తేటతెల్లమైందన్నారు.
భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడులు సాధారణంగా జాతి వివక్షతోనే జరుగుతున్నాయని విజయ్ చవ్వ పేర్కొన్నారు. భారతీయ విద్యార్థులు రాత్రి పొద్దు పోయేంత వరకూ పనిచేయడం, ఆ సమయంలోనే తమతో డబ్బులు కూడా తీసుకు వెళుతుండడం, పైగా దాడి చేసిన దుండగులపై ప్రతిఘటించగలిగేంత ధైర్యస్థులు కాకపోవడమే ఇలాంటి నేరాలకు జాతి వివక్ష ముష్కరుల దాడులకు సులువుగా గురవుతున్నారని ఆయన విశ్లేషించారు. ఇలాంటి నేరాలు కూడా ప్రధానంగా భారతీయ విద్యార్థలు అత్యధిక సంఖ్యలో ఉంటున్న మెల్బోర్న్, సిడ్నీ నగరాల్లో మాత్రమే ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని చవ్వ తన ప్రకటనలో తెలిపారు.
భారతీయ విద్యార్థులు ప్రశాంతంగా, నెమ్మదస్తులుగా ఉండడం కూడా వారిపై దాడులు జరగడానికి కారణమని ఆస్ట్రేలియన్ పోలీసులు భావిస్తున్నారని, అర్ధ రాత్రిళ్ళలో వారు ఒంటరిగా ప్రయాణాలు చేస్తుండడం, తమతో డబ్బులతో పాటు విలువైన వస్తువులను తీసుకువెళుతుండడమే వారిపై సులువుగా దాడులు జరిగేందుకు ఆస్కారం కల్పిస్తున్నదని వారు విశ్లేషిస్తున్నారన్నారు. విదేశీ సంస్కృతితో, ఆచారాలు, సంప్రదాయాలతో త్వరగా మమేకం అయ్యేలా భారతీయ సంఘాలు కొత్తగా వచ్చే వారికి భద్రతలో జాగ్రత్తలు తీసుకోవడంలో సరైన శిక్షణ ఇస్తే ఇలాంటి దారుణాలకు ఆస్కారం ఉండదని అమెరికాలోని తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ సలహా ఇచ్చింది. అలాగే విదేశాల్లో ఉండే తమ పిల్లలు భవిష్యత్తులో ఎలాంటి దాడులకు గురికాకుండా ఉండేలా వ్యక్తిగత భద్రతలో జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.
Pages: 1 -2- News Posted: 5 June, 2009
|