పిఎం బడ్జెట్ ఆదేశాలు!
న్యూఢిల్లీ : ప్రభుత్వ విధానానికి, లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన జరిగేట్లు చూడాలని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ శుక్రవారం కోరారు. ఆర్థిక మంత్రికి ప్రధాని ఈ విధంగా బాహాటంగా ఆదేశం జారీ చేయడం అసాధారణమే. 'పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో పేర్కొన్న ప్రాథమ్యాలు, కార్యక్రమాలను తదుపరి కేంద్ర బడ్జెట్ సముచిత రీతిలో ప్రతిబింబించేట్లు చూడాలని ఆర్థిక మంత్రిత్వశాఖను ప్రధాని కోరారు' అని తెలియజేస్తూ ప్రధాని శుక్రవారం మధ్యాహ్నం ఒక ప్రకటనను విడుదల చేసింది.
పైకి చూడడానికి ఇది మామూలు ఆదేశంలా కనిపిస్తున్నది. ప్రభుత్వ సామాజిక, ఆర్థిక పంథాను బడ్జెట్ ప్రతిబింబించాలని సాధారణంగా ఆశిస్తారు. ప్రధాని కూడా అదే విషయం పునరుద్ఘాటించారు. అయితే, మంత్రివర్గ స్థాయిలో ఆంతరంగికంగా చేసి ఉండవలసిన ఆదేశం గురించి ప్రధాని ఇంత బాహాటంగా ప్రకటన చేయడం ఊహాగానాలకు దారి తీసింది.
'కొత్త ప్రారంభానికి నాంది జరుగుతోంది. మన్మోహన్ సింగ్ రెండవ హయాం మొదటి దానికి భిన్నంగా ఉండగలదు. తాను కొంత అధికుడిననే అభిప్రాయాన్ని ఆయన కలిగించాలనుకుంటున్నారు. మొదటి దఫా ఆయన అలా చేయలేకపోయారు' అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు 'టెలిగ్రాఫ్' పత్రిక విలేఖరితో చెప్పారు.
పిఎంఒ ఆదేశం 'మామూలు ఆఫీసు వర్తమానాన్ని' మించిందనే అభిప్రాయంతో కొత్త మంత్రి మండలి సభ్యుడు ఒకరు ఏకీభవించారు. ఆయన తన పేరు వెల్లడికి ఇష్టపడలేదు. ఒక అసాధారణ చర్యకు ఆయన ఈవిధంగా భాష్యం చెప్పారు. 'మన్మోహన్ సింగ్ ఇప్పుడు మరింత ఆత్మ విశ్వాసంతో ఉన్నారనేది నిజమే. అయితే, ఇటువంటి బహిరంగ సూచనల ద్వారా, సమష్టి బాధ్యత సూత్రాన్ని ఆయన నొక్కి చెప్పాలనుకుంటున్నారు. కీలక రంగాలలో సమన్వయం ఉండేట్లుగా తాను స్వయంగా పర్యవేక్షించగలనని ఆయన ఈ విధంగా ప్రకటించారు. ఆయన మంత్రులు, ముఖ్యంగా మిత్ర పక్షాలకు చెందినవారు ఆయన నియంత్రణలో లేరని, వారు సొంతంగా వ్యవహరిస్తున్నారని ఆయన మొదటి హయాంలో ఒక అభిప్రాయం ఉండేది. ముఖర్జీ వంటి సీనియర్ మంత్రికి ఈ విధంగా బాధ్యతలను నిర్దేశించడం మా అందరికీ ఒక సందేశం వంటిది' అని ఆ మంత్రి వివరించారు.
అయితే, మరొక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజకీయ ఆవశ్యకత కన్నా పాలనే ఇందుకు ప్రేరణ అయి ఉండవచ్చునని భావిస్తున్నారు. 'కాంగ్రెస్ మేనిఫెస్టోకు, ప్రభుత్వ అజెండాకు, బడ్జెట్ కు మధ్య సమన్వయం ఉండాలని రాష్ట్రపతి ప్రసంగాన్ని బట్టి స్పష్టమవుతున్నది. ప్రస్తుతం సాధించదగిన అభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి. ఆ విషయంగా ఆసక్తిని, నిబద్ధతను ప్రధాని నొక్కి చెబుతున్నారంతే' అని ఆ నాయకుడు అభిప్రాయం వెలిబుచ్చారు.
ప్రధాని శుక్రవారం ప్రణాళికా సంఘాన్ని (పిసిని) వేగంగా పునర్వ్యవస్థీకరించడంలో ఆంతర్యం 'మాకు పని ముఖ్యం' అనే సందేశాన్ని పంపడమే. కొనసాగింపునకు, మార్పునకు మధ్య, వేగవంతమైన ఆర్థిక వృద్ధికి, రాష్ట్రపతి ప్రసంగంలో విస్తారంగా ప్రస్తావించిన సామాన్యుని సమస్యల పరిష్కారం పట్ల అంకితభావానికి మధ్య సమతుల్యత సాధించే దిశగానే కొత్త ప్రణాళికా సంఘానికి రూపకల్పన జరిగింది.
Pages: 1 -2- News Posted: 6 June, 2009
|