టీమిండియాలో లుకలుకలు
ధోనీ, సెహ్వాగ్‌ల మధ్య తలెత్తిన విభేదాలు అలాగే ఉన్నట్టు సోమవారం జట్టు ప్రాక్టీస్ సేషన్‌తో తేలిపోయింది. ప్రస్తుతం జట్టులో రెండు గ్రూపలు ఏర్పడ్డాయని, ఒకటి ధోనీకి మద్దతుగా నిలుస్తుండగా, మరో గ్రూపు సెహ్వాగ్‌కు బాసటగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. స్టార్ బౌలర్ హర్భజన్, యువ సంచలనం రోహిత్ శర్మ సాధనకు డుమ్మా కొట్టడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ధోనీ అనుసరిస్తున్న వైఖరితో డాషింగ్ ఓపెనర్ కినుక వహించాడని, అతన్ని సముదాయించేందుకు జట్టు యాజమాన్యం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టినట్టు సమాచారం. ప్రస్తుతం జట్టులో నెలకొన్న పరిస్థితులు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయో తెలియక యాజమాన్యం ఆందోళన చెందుతోంది.
మరో వైపు మీడియాతో కూడా భారత జట్టు కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. టీమిండియా అంతర్గత వ్యవహరాల్లో మీడియా జోక్యం చేసుకోవడంతో జట్టు సారథి ధోనీ ఆగ్రహంతో ఉన్నాడు. ముఖ్యంగా తనకు సెహ్వాగ్‌తో మనస్పర్థాలు ఏర్పడ్డాయని మీడియాలో కథనాలు వెలువడడంతో ధోనీ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ప్రపంచకప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీ సమయంలో మీడియా కావాలనే ఇటువంటి అర్థంపర్థంలేని కథనాలు అల్లుతోందని అతను బహిరంగంగానే విమర్శలు గుప్పించాడు. అంతేగాక మీడియాతో మాట్లాడేందుకు కూడా అతను ఇష్టపపడం లేదు. సోమవారం ప్రాక్టీస్ సేషన్ అనంతరం అతను మీడియాతో ముచ్చటించకుండానే జట్టుతో సహా నిష్ర్కమించాడు.
ప్రపంచకప్ ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కసారి కూడా ధోనీ మీడియాతో మాట్లాడలేదు. దీంతో మీడియా ధోనీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న భారత్ తరఫున ఏ ఒక్కరూ కూడా మీడియాతో మాట్లాడక పోవడాన్ని వారు తప్పుపడుతున్నారు. ఇది ఒక విధంగా తమను అవమానించడమేనని వారు అంటున్నారు. ఇదే విషయాన్ని వారు ఐసీసీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. టీమిండియా తరఫున ఇప్పటివరకు కోచ్ కిర్‌స్టెన్, ప్రజ్ఞాన్ ఓజా మాత్రమే మీడియాతో మాట్లాడారు. ధోనీతో సహా సీనియర్ ఆటగాళ్లు ఎవరూ కూడా వారికి అందుబాటులో లేకుండా పోయారు.
Pages: -1- 2 News Posted: 8 June, 2009
|