'ఇది తీయని వెన్నెల రేయి'
మరొక ప్రత్యేకమైన ఆకర్షణ హాలు బయట పెట్టిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు. చిమట శ్రీనివాసరావు ఎక్కడి నుండి తెచ్చారో గాని చాలా పాతవి అరుదైన సత్యానికి సంబందించిన ఫొటోలు ఎన్నో ఉన్నాయి. సత్యం ప్రముఖ గాయనీ గాయకులు, ఇంకా సంగీత దర్శకులు (ఉత్తరాదివారు కూడా) ఎందరితోనో కలిసి దిగిన ఫొటోలు ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తూ కనువిందు చేశాయి.
విజయ ఆసూరి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సత్యం నేపథ్యాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ కొద్దిసేపు మాట్లాడారు. ఎన్నో మధురమైన పాటలను మనకు అందించినా ఎంతో టాలెంట్ కలిగి ఉన్న వ్యక్తి అయినా సత్యానికి తగిన గుర్తింపు రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అటువంటి మహానుభావుని గౌరవార్థం ఈ వేడుక తలపెట్టినందుకు చిమట శ్రీనివాసరావును అభినందించారు. తరువాత ముఖ్యగాయకుడు, కార్యనిర్వాహకుడు అయిన రవి గుడిపాటిని వేదికపైకి ఆహ్వానించారు.
రవి గుడిపాటి గురించి ఒకమాట చెప్పాలి. నేను ఇంతకు ముందు ఆయన పాటల గురించి విన్నాను గాని, పాటలను మాత్రం వినలేదు! ఆయన పాడుతుంటే కొన్ని సందర్భాలలో సాక్షాత్తు బాలుగారే వచ్చి పాడిన అనుభూతి కలిగింది. ఇకపోతే ఆర్కెస్ట్రా గురించి కూడా ఒక ముక్క చెప్పాలి. అందులోని వారందరూ (సత్య వైద్యనాథన్, వెంకీ సుబ్రమణియం, కృష్ణమూర్తి కల్వై, బాలాజి మహదేవన్, అశ్విన్ కుమార్, శ్రీనాథ్ విశ్వనాథన్) తమిళులు. మన సత్యం కన్నడవారికి తెలుసుగాని తమిళులకు తెలియదు. వీరెవరికీ ఈ పాటలతో పరిచయం లేకపోయినా నెల రోజులలో అభ్యసించి వీరు చక్కని వాద్య సహకారం అందజేశారు.
హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ సంగీత విభావరిని భక్తిగీతంతో ప్రారంభించారు. 'అల్లరిపిల్లలు' చిత్రం నుండి 'శ్రీచక్ర శుభనివాసా, స్వామి జగమేలు చిద్విలాసా' రవి, యామిని పొట్టి పాడితే మిగిలిన గాయనులు హేమ కోటా, సుధ శాస్త్రి, పద్మిని సరిపెల్ల కోరస్ అందించారు.
తరువాత రవి 'స్వప్న' చిత్రం నుండి 'అంకితం నీకే అంకితం' పాటను అద్భుతంగా పాడారు. ముఖ్యంగా ఈ పాటలో 'కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్యకవితా' వంటి అనేక కవితా వాక్యాలు ఉంటాయి. వాటిని స్వరానికి తగ్గట్టుగా పాడి వీనులవిందు చేశారు. ప్రసాద్ దుర్వాసుల యామినితో కలిసి 'ఏ రాగమో ఇది ఏ తాళమో' అనే యుగళగీతం (అమరదీపం) ఆలపించారు.
Pages: -1- 2 -3- -4- -5- News Posted: 9 June, 2009
|