'ఇది తీయని వెన్నెల రేయి'
సిలికాన్ వేలీ (కాలిఫోర్నియా) : శనివారం రాత్రి (జూన్ 6) సన్నీవేల్ నగరంలో పున్నమికి ఒక రోజు ముందు గుడి బయటనే కాకుండా లోపల కూడా నిజంగా వెన్నెల కురిసింది! తెలుగు చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఎన్నెన్నో మధురమైన పాటలకు స్వరాలు సమకూర్చిన అలనాటి ప్రముఖ సంగీత దర్శకుడు సత్యానికి సిలికాన్ వేలీలో స్వరనివాళి జరిగింది. మూడు గంటల పాటు సాగిన ఈ స్వర మంత్రజాలం సుమారు వెయ్యి మంది ప్రేక్షక శ్రోతల్ని మూడు దశాబ్దాల వెనక్కి తీసుకెళ్ళింది. అమెరికాలోని బే-ఏరియాలో బాటా, చిమట మ్యూజిక్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రవాసాంధ్ర సంస్థలు ఒక తెలుగు సంగీత దర్శకుడికి నివాళిగా ఆయన పాడిన పాటలను ఆలపించడం ఒక ప్రత్యేకత. గాయనీ గాయకులంతా స్థానికులవడం ఇంకొక ప్రత్యేకత. వాయిద్య సంగీతాన్ని సమకూర్చిన కళాకారులంతా తమిళులవడం సంగీత ప్రపంచానికి ఎల్లలు లేవని మరోసారి నిరూపించింది. కేవలం 'సత్యం' స్వరపరచిన పాటలతోనే ఫూర్తిగా ఈ కార్యక్రమం విదేశాల్లో నిర్వహించడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు.
ఈ కార్యక్రమానికి సన్నిధి రెస్టారెంట్ (ప్లెజంటన్) గ్రాండ్ స్పాన్సర్ గా, రవి ట్యాక్స్, శ్రీ ట్రావెల్స్, చానెల్ రియల్ ఎస్టేట్ సంస్థలు కో-స్పాన్సర్లుగా వ్యవహరించాయి. ప్రసాద్ మంగిన (బాటా ప్రెసిడెంట్), వీరు ఉప్పాల (బాటా బోర్డ్), చిమట శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాటా & చిమట మ్యూజిక్ కార్యకర్తలు చాలా హుషారుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆసూరి విజయ (బాటా బోర్డ్ & కల్చరల్ చెయిర్) వ్యాఖ్యాతగా ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం రక్తి కట్టించారు.
సాయంత్రం 6.30 నుండి రాత్రి 10.00 గంటల వరకు ఈ స్వర నివాళి కార్యక్రమం కొనసాగింది. ఆణిముత్యాల్లాంటి 26 పాటలను ఎంచుకొని గాయనీ గాయకులు పాడారు. మరొక ముఖ్యాంశం ఏమిటంటే సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ప్రముఖ గిటార్ వాయిద్యకారుడు సాలూరి వాసురావు (ప్రఖ్యాత సంగీత దర్శకులు కీర్తిశేషులు సాలూరి రాజేశ్వరరావు కుమారుడు) నిర్వాహకుల ప్రయత్నాన్ని హర్షిస్తూ ప్రత్యేకించి ఈ కార్యక్రమం కోసమే రికార్డింగ్ చేసి పంపించిన వీడియోలను విరామ సమయానికి ముందు, తరువాత ప్రదర్శించారు. అందులో వారిద్దరూ సత్యంతో తమకు గల అనుబంధాన్ని అనుభవాల్ని ప్రేక్షకులందరితో పంచుకున్నారు.
Pages: 1 -2- -3- -4- -5- News Posted: 9 June, 2009
|