'ఇది తీయని వెన్నెల రేయి'
గోదావరి తీరాన వెలసిన రాజమహేంద్రి వైభవాన్ని వర్ణించడానికి వేయిమాటలు చాలవు కాని ఒక్క పాట చాలు. అదే ఆంధ్ర కేసరి సినిమాలోని 'వేదంలా ఘోషించే గోదావరి, అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి'. ఈ పాటను మురళి సంబర వచ్చి అభినయిస్తూ పాడుతుంటే చిన్నప్పుడు చూసిన వరదగోదావరి పరవళ్లు గుర్తుకొచ్చాయి. అప్పుడే రవికి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనే సందేహం కలిగింది! అందుకని ఒక హుషారైన మత్తెక్కించే పాట అందుకున్నారు. సుధతో కలిసి బుల్లెమ్మ బుల్లోడులోని 'కురిసింది వానా నా గుండెలోనా' అని పాడి అందరి గుండెల్లో వానజల్లు కురిపించారు. ఈ పాటకు ఆర్కెస్ట్రా కళాకారులు మంచి డ్రమ్ బీట్ అందించారు.
శాస్త్రీయ సంగీతంలోని భూపాళ రాగంలో కూర్చిన 'తొలి సంధ్య వేళలో తొలి పొద్దు పొడుపులో' (సీతారాములు) పాటను రవి పాడితే హేమ, పద్మిని రాగాలాపన చేశారు. ఈ పాటకు ఆయువుపట్టైన వేణుగానాన్ని (Flute) అశ్విన్ కుమార్ హృద్యంగా వాయించారు. రవి ఈ పాట పాడిన బాలును ఒకమారు తలుచుకున్నారు.
ఇంతవరకూ పాడిన పాటలన్నీ బాలు పాడినవే. ఇప్పుడు రామకృష్ణ సుశీలతో కలిసి పాడిన భక్త కన్నప్ప చిత్రంలోని 'ఆకాశం దించాలా, నెలవంకా తుంచాలా' అనే శ్రావ్యమైన యుగళగీతాన్ని రవి తాతా, హేమ పాడారు. రవి తాతా గొంతు రామకృష్ణ గొంతుకు బాగా నప్పింది.
తరువాత ఈ కార్యక్రమానికి బ్యానర్ సాంగ్ 'ఇది తీయని వెన్నెల రేయి' (ప్రేమలేఖలు) పాటను ప్రసాద్, సుధ కలిసి పాడుతుంటే (సమయం 7.15) బయట ఇంకా వెలుతురున్నా లోపల మాత్రం వెన్నెలరాత్రిలా అనిపించింది. విజయ్ వేమూరి యామినితో కలిసి పాడిన మాయామశ్చీంద్రలోని 'ప్రణయరాగ వాహినీ.. చెలీ వసంత మోహినీ' అనే మధురగీతం కరతాళధ్వనులతో ముగిసింది.
బాలు స్వయంగా చెప్పిన, తనకు మొట్టమొదటిసారి చాలా పేరు తెచ్చిపెట్టిన పాట. కన్నెవయసు సినిమాలోని 'ఏ దివిలో విరిసిన పారిజాతమో' పాటను రవి (గుడిపాటి) పాడారు. ఈ పాటకు ముఖ్యమైన బేస్ గిటార్ వాయించినది సాలూరి వాసురావు అని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు! ఇప్పుడు ప్రేక్షకులకు బాగా హుషారు పుట్టించాలని ఏజెంట్ గోపి సినిమా నుండి 'ఓ.. హంస బలె రామచిలుకా ఓలమ్మీ' అంటూ హేమ, మురళి ముందుకొచ్చారు. ఇతర గాయనిలు కోరస్ అందించారు. వేదిక మీద మురళి వేసిన అడుగులకు అనుగుణంగా ప్రేక్షకులు కూడా తాళం వేశారు. ఈ పాట పూర్తి కాగానే రవి తాతా 'ఇదే పాటా ప్రతీచోటా ఇలాగే పాడుకుంటా'నంటూ వచ్చారు. పుట్టినిల్లు- మెట్టినిల్లు చిత్రంలోని ఈ పాటకు ఒక ప్రత్యేకత ఉంది. తెర మీద శోభన్ బాబు పాడుతుంటే సాక్షాత్తూ సత్యం కనిపించి సంగీతాన్ని అందజేస్తారు!
Pages: -1- -2- 3 -4- -5- News Posted: 9 June, 2009
|