'ఇది తీయని వెన్నెల రేయి'
రెండవ భాగంలో తొలుత మురళి, సుధ కలిసి సీతారాములు చిత్రం నుండి 'పలికినది పిలిచినదీ.. పరవశమై నవ మోహనరాగం' పాడారు. తరువాత రవి హేమ కలిసి దొంగలకు దొంగ నుండి 'ఒకటే కోరిక నిన్ను చేరాలని' అంటూ ప్రేక్షకులను హుషారెక్కిస్తూ పాడారు. ఈ పాటకు అవసరమైన ఫాస్ట్ డ్రమ్ బీట్స్ అద్భుతంగా కుదిరాయి. యామిని రవి తాతాతో కలిసి 'తొలివలపే తీయనిది' అంటూ ఆలపించారు. ఈ పాట తదుపరి రవి గుడిపాటి యేసుదాసు పాడిన 'గాలివానలో వాననీటిలో పడవ ప్రయాణం' (స్వయంవరం చిత్రం) పాడారు. ఈ పాటను బాలు పాడి ఉంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే రవి పాడిన ఈ పాట వింటే తెలుస్తుంది.
హేమ బాల్యమిత్రుల కథలోని 'గున్నమామిడి కొమ్మ మీద' అంటూ అచ్చు జానకి పాడినట్లుగా పాడారు. పద్మిని, యామిని వెనుక నుండి కోరస్ అందించారు. అందుకు ఏ మాత్రం తీసిపోకుండా యామిని 'రాధకు నీవేరా ప్రాణం' అంటూ తులాభారం సినిమా నుండి పాట పాడారు.
తరువాత మురళి హేమతో కలిసి 'సన్నాజాజికి, గున్నామామికి పెళ్లి కుదిరింది' పాడారు. ఈ పాటకు అత్యంత అవసరమైన ఢోలక్ వాద్యాన్ని బాలాజీ మహదేవన్ ప్రత్యేకంగా వాయించారు. పాటలు బాగున్నాయా? మరి చప్పట్లు వినిపించటంలేదేం? అని రవి చమత్కరించారు. పిమ్మట రవి తాతా సుధ కలిసి నోము సినిమాలోని 'కలిసే కళ్లలోనా మెరిసే పూలవానా' పాడారు. ముఖ్యంగా సుధ ఈ పాటను చాలా బాగా పాడారు. తరువాయి పాట కార్తీకదీపం చిత్రంలోని 'నీ కౌగిలిలో తలదాచి' ని యామిని - రవి ఒకరిని మించి ఒకరు పాడారు. అచ్చం జానకి - బాలు పాడినట్లే ఉంది. పూలకొమ్మ ఆడింది, కోయిలమ్మ పాడింది.. మరి పైడిబొమ్మ కనబడదేం? అని ప్రశ్నిస్తూ విజయ్ ముందుకొచ్చి అందమే ఆనందం సినిమాలోని 'మధుమాస వేళలో మరుమల్లె తోటలో' అనే విరహగీతం ఆలపించారు. రవి సుధతో గొంతుకలిపి 'తొలిసారి ముద్దివ్వమంది చెలిబుగ్గ చేమంతిమొగ్గ' అనే పాట (ఎదురీత) సినిమాలోనిది పాడారు.
చిట్టచివరిగా రవి ప్రేక్షకులను ఒక ఊపు ఊపుతూ అన్నదమ్ముల సవాల్ లోని 'నా కోసమే నీవున్నది ది ది' పాటను పాడారు. పాటకు ముందర ప్రేక్షకులలో కృష్ణ అభిమానులెవరైనా ఉన్నారా? అని ఒక సవాల్ కూడా విసిరారు.
విజయ ముగింపు ప్రసంగం చేశారు. చిమట శ్రీని కూడా అందరికీ ధన్యవాదాలు తెలిపి ఇంకొక ఆరు నెలలలో కె.వి.మహదేవన్ పాటలపై మరొక కార్యక్రమం నిర్వహిస్తానని చెప్పారు.
Pages: -1- -2- -3- -4- 5 News Posted: 9 June, 2009
|